ఆదిభట్ల, జూలై 1: హైకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నిర్వహణకు రంగం సిద్ధమైందని చెప్పాలి. గత రెండు మూడు రోజుల క్రితం హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి వెంటనే మూడు నెలల లోపు స్థానిక సంస్థలే ఎన్నికలు నిర్వహించాలని అక్షింతలు వేసింది. దీంతో ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. జిల్లాలోని గ్రామపంచాయతీలు, వార్డులు, ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ఉంచిన జిల్లా యంత్రాంగం వాటిని మరోసారి సరిచేసుకునే పనిలో పడింది. ఇప్పటికే బూతుల వారీగా ఓటర్ లిస్ట్‌లను తయారుచేసి ఎన్నికలు ఎప్పుడు పెట్టినా నిర్వహించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు తేలిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిసింది.
రంగారెడ్డి జిల్లాలో పంచాయతీ పోరుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా నిర్వహించడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. దీంతో గ్రామాలలో ఆశావాహులు కూడా స్థానిక పోరుపై రిజర్వేశారు. దానికి అనుగుణంగానే పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఏవి ముందుగా వచ్చిన అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టారు. రంగారెడ్డి జిల్లాలో 21 మండలాలలో ఎంపీటీసీ స్థానాలు 232, గ్రామపంచాయతీలు 526, ఎంపీపీలు 21, జడ్పీటీసీలు 21, పంచాయతీ వార్డులు 4896 ఉన్నాయి. జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 7 లక్షల 94 వేల 653 మంది ఉండగా అందులో పురుషులు మూడు లక్షల 99 వేల 404 మంది, మహిళలు 3 లక్షల 95 వేల 216 మంది, ఇతరులు 33 మంది ఉన్నారు. అదేవిధంగా జిల్లాలో 15 మున్సిపాలిటీలు ఉండగా మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, అసెంబ్లీ నియోజకవర్గాలు 8 ఉన్నాయి. కాగా జీహెచ్ఎంసీ డివిజన్లు మహేశ్వరంలో 2, ఎల్బీనగర్లో 11, గచ్చిబౌలిలో 7, రాజేంద్రనగర్‌లో 5 ఉన్నాయి.
కాగా 2024 ఫిబ్రవరి 1న సర్పంచులు, జూన్ 31న ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, ఆగస్టు నెలలో మున్సిపాలిటీల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి గ్రామాలు, పట్టణాలలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో గ్రామ, మండల స్థాయిలో కష్టపడిన ఆయా పార్టీల నాయకులు ఇప్పుడు తమ లక్ష్యం అంత స్థానిక సంస్థలో పోటీ చేయడమే అని తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎన్నికల నిర్వహణపై ప్రకటన రావడమే తరువాయి అన్న చందంగా పంచాయతీలలో నిత్యం ఆశావాహులు ప్రజల సమస్యలను ఆలకిస్తున్నారు. ముఖ్యంగా గ్రామస్థాయిలో సర్పంచ్ కు టీ చేసే విషయంలో గ్రామాలలో ఈసారి గట్టి పోటీ కనబడుతుంది.
మూడు ప్రధాన పార్టీల మద్దతు, స్వతంత్రంగా బరిలో నిలవాలనుకునేవారు ఆశల లోకంలో విహరిస్తున్నారు. గతంలో పోటీ చేసి ఓడిపోయిన వారితో పాటు కొత్త వాళ్లు, యువత ఎక్కువగా ఈ పదవిపై కన్నేస్తున్నారు. ఇందుకోసం ఏ పార్టీ మద్దతు ఉంటే తమకు లాభం ఉంటుందని విషయంపై ఆలోచిస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటికే పార్టీలు యువతకు దావతులతో కిక్కిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఇప్పటికే పంచాయతీల వారీగా యువతను ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
కోర్టు ఆదేశాలతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముందుగా నిర్వహించి, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు తెలిసింది. కొన్ని రోజులుగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలపై కన్నేసిన నాయకులు ఇప్పటికే తమ బలాలను చూపించుకుంటున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అతి మర్యాదలు చేస్తున్నారు. తమ పార్టీ ముఖ్య నేతలను కలుస్తూ తమ అభ్యర్థిత్వాన్ని తెలుపుతున్నారు. ఎమ్మెల్యే మంత్రుల స్థాయిలో అనుకూల రిజర్వేషన్‌పై పార్టీ పరంగా 42 శాతమా లేదా చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి అనే చర్చ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కుల గణన కూడా పూర్తిచేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సమర్పించింది. దీంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఎన్నికలు నిర్వహించనున్నారని తెలిసింది. దీంతో పల్లెల్లో ఆశావాహుల సందడి మరింత పెరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన హామీలను పూర్తిగా విస్మరించిందని ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలలో పూర్తిగా వ్యతిరేకత ఏర్పడింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే ఓడిపోతామని భయం రాష్ట్ర ప్రభుత్వానికి పట్టుకుంది. ఇప్పటికే గ్రామాలలో అభివృద్ధి పూర్తిగా కుంట్టు పడిపోయింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ నేత పల్లె గోపాల్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రతి ఎన్నికలలో బీసీలకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీ లకు తమ వాటా 42% రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పటికే గ్రామాలలో అధికారుల పాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.