AI Teaching Center | కేశంపేట, మార్చి 25: రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధనా కేంద్రం ప్రారంభమైంది. ఈ ఏఐ టీచింగ్ సెంటర్ను ఎఫ్ఎల్ఎన్ లెర్నింగ్ ల్యాబ్ అకాడెమిక్ మానిటరింగ్ జిల్లా అధికారి జయచంద్రారెడ్డి, మండల విద్యాధికారి చంద్రశేఖర్ ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. చదువులో వెనుకబడిన పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి, దాన్ని పెంపొందించడంలో ఎఫ్ఎల్ఎన్ లెర్నింగ్ ల్యాబ్ తోడ్పడుతుందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధనా కేంద్రం ద్వారా చదవడం, రాయడం రాని విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 13 ఏఐ టీచింగ్ సెంటర్లు మంజూరయ్యాయని, అందులో మన జెడ్పీహెచ్ఎస్కు చోటు లభించడం సంతోషకరమని అన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో 50మంది విద్యార్థులు గల పాఠశాలల్లో సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధనా కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్పీలు శరత్చంద్ర, స్వప్న, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి, ఉపాధ్యాయులు లలితాకుమారి, కళ్యాణి, శ్రీదేవి, స్రవంతి, మంజుల, సీఆర్పీలు రామకృష్ణయ్య, మల్లయ్య, కంప్యూటర్ ఆపరేటర్ గోపి, తదితరులు పాల్గొన్నారు.