షాబాద్, మే16: రైతులు పంట మార్పిడి విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ శిరీషా, సతీశ్, శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని మద్దూరు, తిమ్మారెడ్డిగూడ గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శిరీషా మాట్లాడుతూ.. పంటలకు యూరియా వాడకాన్ని తగ్గించాలని, ఒకేసారి కాకుండా దఫదఫాలుగా వేసుకోవాలని సూచించారు.
అవసరం మేరకే మాత్రమే వాడుతూ రసాయనాలు వినియోగం తగ్గించి, నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. రైతులు విత్తనాలు, పురుగుల మందులు కొనుగోలు చేసి సంబంధిత రశీదులు భద్రపర్చుకోవాలన్నారు. పంట నూర్పిడి విధానాన్ని పాటించాలన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సతీశ్ మాట్లాడుతూ..రైతులు వరి, పత్తి, కుసుమ, కంది తదితర పంటలలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. వరి, పత్తి పంటలో కలుపు నివారణ, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం తదితర అంశాల గురించి రైతులకు వివరించారు.
ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ..గ్రామాల్లో రైతులు పండిస్తున్న ప్రధాన పంటల మార్కెటింగ్ గురించి వివరించారు. రైతు సమాఖ్య సంస్థలను స్థాపించాలని కోరుతూ అవసరమైన ఎరువులు ముఖ్యంగా యూరియా, పురుగుల మందుల వాడకాన్ని తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ అధికారి వెంకటేశం, పశుసంవర్దకశాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ మద్దూరి పాండు, సహకార సంఘం వైస్ చైర్మన్ మద్దూరి మల్లేశ్, శాస్త్రవేత్త డాక్టర్ అర్చన, విశ్వవిద్యాలయం రిసెర్చ్ స్కాలర్స్ అవనీజ, ఉమ, ఏఈఓలు రాజేశ్వరి, గీత, ప్రవీణ్‌కుమార్, స్నేహ, మాజీ సర్పంచులు నరేందర్‌రెడ్డి, శకుంతల, రైతులు తదితరులు పాల్గొన్నారు.