కొడంగల్, ఆగస్ట్టు 17: రుణమాఫీ పొందని రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన మూడో దఫా రూ.2లక్షల రైతు రుణమాఫీ రైతులకు నిరాశను మిగిలించింది. అర్హత ఉన్నప్పటికీ ఆయా కారణాల వల్ల రుణమాఫీ పొందలేదని అధికారులు పేర్కొనడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు.
మండలంలోని హస్నాబాద్ వ్యవసాయ క్లష్టర్ రైతువేదికలో మొత్తంగా దాదాపు 2200 మంది రైతులు ఉన్నారు. వీరిలో మొదటి, రెండో దఫాలో రూ.లక్ష, రూ.1,50 లక్షలు మొత్తంగా 700 మంది వరకు రైతులు రుణమాఫీని అందుకున్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. మూడో దఫా కింద ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో రైతులు బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తూ.. రుణమాఫీ వివరాలను తెలుసుకొంటున్నారు.
అదేవిధంగా రుణమాఫీ రాని రైతులు వ్యవసాయ కార్యాలయం ఎదుట నిరిక్షిస్తూ రుణమాఫీ ఎందుకు రాలేదని అధికారులను సంప్రదిస్తున్నారు. దీంతో వ్యవసాయ కార్యాలయాలకు రైతుల తాకిడి పెరిగింది. రుణమాఫీ అయ్యిందా.. లేదా.. అని తెలిపేందుకు అటు బ్యాంకు అధికారులు, ఇటు వ్యవసాయాధికారులు ఆసక్తిని చూపడం లేదని, కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయాధికారులు రైతులను చీదరించుకుంటున్నట్లు రైతులు పేర్కొంటున్నారు.
దేవుడు వరమిచ్చినా, పూజారి అడ్డుకొన్నట్లుగా రుణమాఫీ స్టేటస్‌ను తెలుసుకోవడం గగనంగా మారిందని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ శాఖలో ఏఈవోల బదిలీలు కావడంతో సమాచారం అందుకోవడం ఇబ్బందిగా మారిందని, బదిలీ అయినవారు తమకు తెలియదని సమాధానం, కొత్తవారు రాకపోవడంతో ఎవరిని సంప్రదించాలో అర్థం కావడం లేదని రైతులు వాపోతున్నారు. నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల పరిధిలో మొత్తంగా 52,305 మంది రైతులు ఉన్నారు.
వీరిలో మొదటి దఫాలో 9604 మంది రైతులు రూ.లక్ష రుణమాఫీని అందుకోగా.. రెండో దఫాలో రూ.1.50లక్షల రుణమాఫీతో 6057 మంది లబ్ధి పొందారు. ఇక మిగతా 36,644 మంది రైతుల్లో రూ.2లక్షలు తీసుకొన్న వారు కొంతమందే ఉన్నప్పటికీ.. అందులోనూ సగం మంది కూడా రుణమాఫీ పొందలేక పోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డు, ఆధార్‌కార్డు వంటి తప్పులను చూపించి రుణాలు మాఫీ చేయలేదని అన్నదాతలు ఆరోపిస్తున్నారు.
రేషన్‌కార్డులో పేరు లేదని..
రేషన్ కార్డులో పేరు లేదని రుణమాఫీని పొందలేదు. హస్నాబాద్ గ్రామ పరిధిలో 4 ఎకరాల 8 గంటల భూమి ఉంది. గతంలో బ్యాంకులో అప్పు తీసుకొని మళ్లీ సరైన సమయంలో రుణాన్ని కట్టి రెన్యువల్ చేయించా. ప్రస్తుతం రూ.1.60లక్షల అప్పు ఉన్నది. ప్రభుత్వం మూడో దఫాల్లో రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పగా.. బ్యాంకుకు వెళ్లి చూస్తే లిస్టులో నా పేరు లేదు. రూ.2లక్షల లోపు అప్పు ఉన్నప్పటికీ మాఫీ కాకపోవడం చాలా బాధగా ఉంది. కొంత మందికి మాఫీ అయి.. అర్హత ఉన్నప్పటికీ నా రుణ మాఫీ కాలేదు. దీనిపై అధికారులను సంప్రదిస్తే రేషన్ కార్డులో పేరు లేనందున మాఫీ కాలేదని తెలుపుతున్నారు. అప్పును అప్పుగానే చూడాలి కానీ రేషన్‌కార్డు, బంధుత్వం అని చూసి మాఫీచేస్తే మాలాంటి ఎంతో మంది రైతులు ఈ విధంగా నష్టపోవడం జరుగుతుంది.
-బోయిని కిష్టమ్మ, హస్నాబాద్. కొడంగల్