రంగారెడ్డి, జూన్ 7 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో యథేచ్చగా చెరువులు, కుంటలు, ఇరిగేషన్ కాల్వలు కబ్జాకు గురవుతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలొస్తున్నాయి. ఓవైపు జిల్లాలో చెరువులు, కుంటల ఆక్రమణ, కాల్వల కబ్జాలపై హైడ్రా దూకుడు పెంచినప్పటికీ అక్రమార్కుల ఆగడాలు మాత్రం ఆగటంలేదు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ఔటర్‌రింగ్ రోడ్డుకు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల్లో చెరువులు, కుంటల ఆక్రమణలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
చెరువుల పక్కనే ఉన్న పట్టా భూములు కలిగినవారు రాత్రికి రాత్రే బయటనుంచి మట్టిని తీసుకువచ్చి చెరువులను పూడ్చివేసి పట్టా భూముల్లో కలిపేసుకుంటున్నారు. మరికొన్నిచోట్ల చెరువు పక్కనే భూములు కొనుగోలు చేసిన రియల్ఎస్టేట్ వ్యాపారులు అధికారుల అండదండలతోనే యథేచ్చగా చెరువులు, కుంటలు మాయం చేస్తున్నారు. మరికొన్నిచోట్ల బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ లోపల కూడా గుట్టుచప్పుడు కాకుండా ఎల్ఓసీలు తీసుకువచ్చి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. నగరశివారుల్లోని రంగారెడ్డి జిల్లా పరిధిలోని తుర్కయంజాల్ మాసబ్‌చెరువు, పెద్దఅంబర్‌పేట్ మున్సిపల్ పరిధిలోని కుంట్లూరు పెద్దచెరువు, పెద్దఅంబర్‌పేట్ ఈదుల చెరువు కబ్జాకు గురైనట్లు స్థానికులు ఫిర్యాదు చేయగా…హైడ్రా అధికారులు సందర్శించి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలొస్తున్నాయి. అలాగే, ఔటర్లోపలి మున్సిపాలిటీలైన తుర్కయంజాల్, పెద్దఅంబర్‌పేట్, ఆదిబట్ల, తుక్కుగూడ, శంషాబాద్ తదితర మున్సిపాలిటీల్లో చెరువులు, కుంటలు రాత్రికి రాత్రే మటుమాయమవుతున్నాయి. కాపాడాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. మరికొన్నిచోట్ల రియల్ఎస్టేట్ వ్యాపారులు ఇరిగేషన్ అదికారుల సహాయసహకారాలతో పాత తేదీల్లో ఎన్ఓసీలు తీసుకుని ఎఫ్టీఎల్ లోపల కూడా మట్టిపోసి చెరువులను పూడ్చివేసి ఇండ్ల నిర్మాణానికి విక్రయిస్తున్నారు. దీంతో జిల్లాలోని విలువైన చెరువు, కుంటల భూములు అక్రమార్కులు వశపరుచుకుని కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఈ వ్యవహారంపై గ్రామస్తులు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికి స్పందించటంలేదని ప్రజలు వాపోతున్నారు.
జిల్లాలో 2.132 చెరువు, కుంటలు..
రంగారెడ్డిజిల్లాలో 2.132చెరువు, కుంటలున్నాయి. ఇటీవల వర్షాలు కురవకపోవడంతో చెరువు, కుంటల్లో ఉన్న నీరు ఇంకిపోయి ఖాళీగా కనిపిస్తుండటంతో అక్రమార్కులు వీటిని రాత్రికి రాత్రే పూడ్చివేస్తున్నారు. మరికొన్నిచోట్ల చెరువుల్లోకి నీరొచ్చే ఇరిగేషన్ ప్రధానకాల్వలు కూడా కబ్జాకు గురై చెరువులకు నీరొచ్చే దారులు మూసుకుపోయాయి.
రాచకాల్వలను చెరబడుతున్న అక్రమార్కులు..
జిల్లాలో అతిపెద్ద ఇరిగేషన్ పరిధిలోగల రాచకాల్వ పలుచోట్ల అక్రమాలకు గురవుతోంది. చేవెళ్ల మండలంలోని చందనవెల్లి నుంచి ఇబ్రహీంపట్నం పెద్దచెరువు వరకు గల రాచకాల్వ ఎక్కడికక్కడే కబ్జాకు గురైంది. దీంతో రాచకాల్వ నుంచి ఇబ్రహీంపట్నం చెరువుకు నీరు రావటం ఆగిపోయింది. పలుచోట్ల రియల్ఎస్టేట్ వ్యాపారులు ఎన్నో ప్రాశస్త్యం గల ఈ రాచకాల్వలను ఎక్కడికక్కడే మూసివేస్తున్నారు. రాచకాల్వ మరమ్మతు పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయించి కాల్వ మరమ్మతు చేసింది. కాని, ఇటీవల రియల్ఎస్టేట్ వ్యాపారులు కాల్వను ఎక్కడికక్కడే కబ్జా చేయటం వల్ల కొన్నిచోట్ల కాల్వ పూర్తిగా మూసుకుపోయింది.
మూసుకుపోయిన బ్రాహ్మణపల్లి చెరువు కాల్వ…
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి సమీపంలోగల బ్రాహ్మణపల్లి చెరువులోకి నీరొచ్చే ప్రధాన కాల్వ రియల్ఎస్టేట్ వ్యాపారులు కనుమరుగు చేశారు. ఈ కాల్వ ద్వారా సుమారు నాలుగైదు గొలుసుకట్టు చెరువులకు నీరొచ్చేది. కాని, ఇటీవల ఏపీఆర్ రియల్ఎస్టేట్ సంస్థ ఈ చెరువులోకి నీరొచ్చే ప్రధాన కాల్వకు అడ్డంగా గోడను నిర్మించారు. చిన్నపాటి కాల్వ మాత్రమే వదిలేసి దానిపై కప్పివేయటం వలన కాల్వ పూర్తిగా మూసుకుపోయింది. దీంతో బ్రాహ్మణపల్లి చెరువు పూర్తిగా ఎండిపోయింది. చెరువు ఎండిపోవటంతో పక్కనే ఉన్న అరుంధితి నగర్ పరిసరాల్లో ఉన్న రియల్ఎస్టేట్ వ్యాపారులు చెరువును సైతం ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. అలాగే, ఈ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్లోగల గూడెంకుంట, మన్నెగూడలో గల ఎర్రకుంట, ఎంఎంకుంటలో గల కొత్తచెరువు కబ్జాకు గురవుతున్నట్లు గ్రామస్తులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవటంలేదు. అలాగే, మన్నెగూడలో గల గంగరాయి చెరువులో సైతం రియల్ఎస్టేట్ వ్యాపారులు ఎన్ఓసీలు తీసుకువచ్చి చెరువును సైతం యథేచ్చగా పూడ్చివేస్తున్నారు.
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడలో గంగరాయిని చెరువును యథేచ్చగా పూడ్చివేతను అడ్డుకుంటున్న అధికారులు
మాయమవుతున్న మాసబ్‌చెరువు..
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోగల మాసబ్‌చెరువు క్రమక్రమంగా మాయమవుతూ వస్తుంది. ఈ చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం స్వయంగా వచ్చి పరిశీలించారు. అప్పటికే రియల్ఎస్టేట్ వ్యాపారులు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోగల భూమిలో ఆథిత్య నగర్ పేరిట వెంచర్‌చేసి ప్లాట్లను విక్రయించారు. అలాగే, ఈ చెరువు మస్కతి ఐస్‌క్రీం పార్లర్ ఎదురుగా గల బఫర్‌జోన్‌లో నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా నోరు మెదపటం లేదని ఆరోపణలొస్తున్నాయి. అలాగే, పెద్దఅంబర్‌పేట్‌మున్సిపాలిటీ పరిధిలోగల కుంట్లూరు పెద్దచెరువు, పెద్దఅంబర్‌పేట్ ఈదుల చెరువులు సైతం కబ్జాలకు గురయ్యాయి. ఈ చెరువుల కబ్జాపై గ్రామస్తులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారులు చెరువును పరిశీలించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని గ్రామస్తులు తెలిపారు. అలాగే, యాచారం మండలంలోని మొగుళ్లవంపు మొద్దులకుంట, కడ్తాల్‌లోని వంపుగూడ చెరువు, మంచాల మండలంలోని ఆరుట్ల గ్రామంలోగల పడమటి చెరువును ఏకంగా కబ్జాచేసి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా రియల్ఎస్టేట్ వ్యాపారులు చెరువు, కుంటలనే టార్గెట్‌చేసి అక్రమాలకు పాల్పడుతున్నారు.
మూసుకుపోతున్న కాల్వలు…ఎండిపోతున్న చెరువులు..
రంగారెడ్డి జిల్లాలో చెరువు, కుంటలకు నీరందించే ప్రధానమైన ఇరిగేషన్ కాల్వలు ఎక్కడికక్కడే కబ్జాకు గురువుతున్నాయి. అనాజ్‌పూర్ సమీపంలోగల ఇందిరాసాగర్ చెరువుకు ఆదిబట్ల నుంచి మంగల్‌పల్లి, శేరిగూడ, ఇబ్రహీంపట్నం, నాగన్‌పల్లి గ్రామాల మీదుగా ఇందిరాసాగర్ వరకు గల పులిందర్‌వాగు పలుచోట్ల కబ్జాకు గురైంది. కబ్జాకు గురవుతున్నా విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెల్లినా స్పందించటం లేదని ఆయా గ్రామస్తులు వాపోతున్నారు. అలాగే, బ్రాహ్మణపల్లి చెరువులోకి నీరొచ్చే ప్రధాన కాల్వను సైతం పూర్తిగా పూడ్చివేసి కాల్వలపైనే కట్టడాలు జరిపారు.దీంతో కాల్వలు పూర్తిగామూసుకుపోయి చెరువులోకి నీరు రావటంలేదు. అలాగే, చేవెళ్ల మండలంలోని చందనవెల్లి నుంచి రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాల నుంచి ఇబ్రహీంపట్నం పెద్దచెరువుకు నీరొచ్చే ప్రధాన రాచకాల్వకు కూడా ఎక్కడికక్కడే కబ్జాకు గురైంది. రియల్ఎస్టేట్ సంస్థలు రాచకాల్వను కబ్జాచేసి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. రాచకాల్వపై ఎలాంటి అనుమతులు లేకుండానే ఓ విద్యాసంస్థ ఏకంగా బ్రిడ్జిని సైతం నిర్మించింది. ఈ కాల్వ ఆదిబట్ల, నాదర్గుల్, మంగల్‌పల్లి, పటేల్‌గూడ,పోచారం, ఉప్పరిగూడ గ్రామాల్లో ఎక్కడికక్కడే కబ్జాకు గురైంది. సుమారు 1250హెక్టార్ల ఆయకట్టుకు నీరందించే ఇబ్రహీంపట్నం పెద్దచెరువుకు నీరు రావటానికి ఇదే కాల్వ ప్రధానమైంది. ఈ కాల్వ కబ్జాకు గురై నీరు రాకపోవటంతో చెరువు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. అలాగే, రావిర్యాల పెద్దచెరువులోకి నీరొచ్చే ప్రధాన కాల్వలు సైతం కబ్జాకు గురవుతున్నాయి. సంబందిత ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఆయా రియల్ఎస్టేట్ సంస్థలతో కుమ్మక్కై ఆక్రమణలకు ఆడ్డుకట్ట వేయటం లేదనే ఆరోపణలొస్తున్నాయి. చెరువులు, కుంటల ఆక్రమణలకు అడ్డుకట్టవేయాలని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఇటీవల జరిగిన రెవెన్యూ సదస్సుల్లో అధికారులకు ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ చర్యలు చేపట్టడంలేదని ప్రజలు వాపోతున్నారు. వెంటనే కబ్జా దారులపై చర్యలు తీసుకుని చెరువు, కుంటలను పరిరక్షించాలని జిల్లా మత్స్యకారసంఘం నాయకులు కోరుతున్నారు.