సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. వానకాలం ప్రారంభమై వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. వానలు కురుస్తుండటంతో అన్నదాతలు దుక్కులు దున్ని విత్తనాలను విత్తే పనుల్లో నిమగ్నం కావడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నది. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో రైతులు ఎరువుల కోసం తీవ్ర అవస్థలు పడేవారు. బస్తా ఎరువు కోసం భారీ క్యూలు, ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన దుస్థితి ఉండేది.. కానీ.. ప్రస్తుతం సీజన్‌కు ముందే అవసరమైన ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది.
ఎరువులు పక్కదారి పట్టకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నది. వికారాబాద్ జిల్లాలో ఈ వానకాలం సీజన్లో యూరియా, డీఏపీ, ఎన్పీకేఎస్, ఎంవోపీ, ఎస్ఎస్పీ అన్ని ఎరువులు కలిపి 74,683 మెట్రిక్ టన్నుల అవసరమని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అంతేకాకుండా ప్రతినెలా అవసరమైన ఎరువుల కంటే అదనంగా 10 శాతం ఎరువులను జిల్లాలోని స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉంచుతున్నారు.
జూన్ నెలకు సంబంధించి అన్ని ఎరువులు కలిపి 9,778 మెట్రిక్ టన్నులు అవసరం కాగా.. ప్రస్తుతం 18, 648 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాలోని డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయాధికారులు వెల్లడించారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో యూరియా 10,155.195 మెట్రిక్ టన్నులు, డీఏపీ 3,266.286, ఎస్ఎస్పీ 212.658, ఎంవోపీ 183.32,కాంప్లెక్స్ 3,999.50 మెట్రిక్ టన్నులను అధికారు లు అందుబాటులో ఉంచారు. అదునుకు ముందే సర్కారు ఎరువులను అందుబాటులో ఉంచడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సమైక్య రాష్ట్రంలో వ్యవసాయం అంటేనే దండగ అనే అభిప్రాయం రైతుల్లో ఉండేది. విత్తనాలు, ఎరువుల కోసం అన్నదాతలు పడ్డ ఇబ్బందులు కోకొల్లలు. సీజన్‌కు ముందు ఏనాడూ అందిన దాఖలాలు లేవు. వానకాలమైనా.. యాసంగైనా.. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు యుద్ధాలే చేయాల్సిన పరిస్థితులు. సగం సీజన్ ముగిస్తే తప్ప ఎరువులు వచ్చేవి కావు. విత్తనాలు, ఎరువుల కోసం బారులు తీరడం నిత్యకృత్యం. ధర్నాలు, రాస్తారోకోలు, పోలీసుల లాఠీఛార్జీలుండేవి. కొన్ని సందర్భాల్లో అయితే క్యూ లైన్లలో చెప్పులు పెట్టిన సందర్భాలున్నాయి. ఒక్క ఎరువుల కోసమే కాదు, విత్తనాలు, ధాన్యం కొనుగోలు వరకు రైతులను పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. సరిపోను ఎరువులు లేకపోవడం, పంటల సాగుకు తప్పనిసరిగా విత్తనాలు వేయాల్సిన పరిస్థితితో రైతులకు కష్టాలు తప్పేవికావు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఎరువులు, విత్తనాల కోసం రైతుల కష్టాలు తప్పాయి. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పంట సాగుకు పెట్టుబడి మొదలుకొని పంట రుణాల మాఫీ, పంట చేతికొచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టారు. గత తొమ్మిదేండ్లుగా సకాలంలో రైతులకు అందజేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.
పక్కా ప్రణాళికతో..
సీజన్‌కు ముందే ఎంతమేర ఎరువులు అవసరమనేది చూసుకొని సకాలంలో అవసరానికి మించి ఎరువులుండేలా పక్కా ప్రణాళికతో అధికారులు ముందుకెళ్తున్నారు. ఎరువుల విక్రయాల్లో ఎలాంటి అవకతవకలు జరుగకుండా పూర్తి పారదర్శకంగా ఎరువులను విక్రయించేందుకు ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చారు. సకాలంలో రైతులకు ఎరువులు అందుతుండడంలో విత్తనాలు నాటడంలో రైతాంగం బిజీ అయ్యారు. సీజన్ ప్రారంభం కాకముందే విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి వస్తున్నాయని, ఎక్కడికి వెళ్లినా సునాయసంగా పొందగలుగుతున్నామని రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది. తొలకరి వానలు కురుస్తుండడంతో అన్నదాతలు దుక్కులు దున్ని విత్తనాలను విత్తుకునే పనిలో నిమగ్నమయ్యారు.
క్షేత్రస్థాయిలో పంటల సర్వే
ప్రతి గ్రామపంచాయతీలో ఏఈవోలు క్షేత్రస్థాయిలో పంటల సర్వే నిర్వహిస్తుండడంతో ఎరువులు, విత్తనాలు ఎంతమేర అవసరమనేది ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ప్రతి నెలా ఎంతమేర ఎరువులు అవసరమో దానికనుగుణంగా ఎరువుల స్టాక్‌ను జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంచుతున్నది. పీఏసీఎస్, కంపెనీ గోదాంలు, మార్క్‌ఫెడ్, వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల ద్వారానే ఎరువులను సరఫరా చేస్తున్నారు. స్టాక్ పాయింట్ నుంచి జిల్లాకు ఎంత సరఫరా అయ్యింది, జిల్లాలోని స్టాక్ పాయింట్ ద్వారా ఆయా ఎరువుల దుకాణాలను ఎంతమేర ఎరువులు సరఫరా అయ్యాయనే వివరాలతోపాటు ఎరువుల దుకాణాల నుంచి రైతులు ఎంతమేర కొనుగోలు చేశారనే పూర్తి వివరాలు ఆన్లైన్లో ఎప్పటికప్పుడు అప్డేట్ కానుంది.
1,02,504 టన్నుల ఎరువులు సిద్ధం
రంగారెడ్డి, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది రంగారెడ్డి జిల్లాలో వానకాలంలో వివిధ పంటల సాగు విస్తీర్ణం 4,04,081 ఎకరాలు కాగా.. అందుకు తగ్గట్టుగా వ్యవసాయ శాఖ సరిపోను విత్తనాలతోపాటు 1,02,504 టన్నుల ఎరువులను రైతుల కోసం సిద్ధం చేసి ఉంచింది. రంగారెడ్డి జిల్లాలో 21,750 క్వింటాళ్ల వరి విత్తనాలు, 680 క్వింటాళ్ల జొన్న, 7,200 క్వింటాళ్ల మొక్కజొన్న, 930 క్వింటాళ్ల కందులు, 40 క్వింటాళ్ల పెసర్లు.. మొత్తం 20,661క్వింటాళ్ల పలు రకాల విత్తనాలను డీలర్ల వద్ద వ్యవసాయ శాఖ అందుబాటులో ఉంచింది. జీలుగ 235.8 క్వింటాళ్లు, జనుము 3,604.4క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీజన్లో 41,849 టన్నుల యూరియా అవసరం కాగా.. 10,155.195 టన్నులను అందుబాటులో ఉంచారు. డీఏపీ 15,816 టన్నులకుగాను 3,266.286 టన్నులు, ఎస్ఎస్పీ 4,177కు 212.658, ఎంవోపీ 5,013కు 183.32, కాంప్లెక్స్ 35,649 టన్నులకుగాను 3,999.50 టన్నులను అందుబాటులో ఉంచారు.
4,87,631 ఎకరాల్లో పంటల సాగు
తెలంగాణ రాష్టం ఏర్పాటుకు ముందు రంగారెడ్డి జిల్లాలో వివిధ పంటల సాగు విస్తీర్ణం కేవలం 50వేల ఎకరాల్లో మాత్రమే ఉండేది. సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నేపథ్యంలో సాగు విస్తీర్ణం సైతం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం వానకాలం సీజన్లో వరి 87వేల ఎకరాల్లో, జొన్న 17వేలు, మొక్కజొన్న 90వేలు, పెసర్లు 500, కందులు 31వేలు, పత్తి 1.99లక్షలు, మినుములు 37, వేరుశనగ 60, ఆముదం 900, చెరుకు 80, సోయాబిన్ 54, ఇతర పంటలు కూరగాయలతో కలుపుకుని 62వేల ఎకరాల్లో మొత్తం 4,87,631 ఎకరాల్లో పంటలను సాగు చేయనున్నుట్లు వ్యవసాయ శాఖ అంచనాలు వేస్తున్నది.
రూ.378.95 కోట్ల పెట్టుబడి సాయం
గత పది విడుతల్లో రూ.3,017.91 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందజేసిన ప్రభుత్వం ప్రస్తుత వానకాలంలో 3,94,066 మంది రైతులకు రూ.378.95 కోట్ల సాయాన్ని అందజేయనున్నది.
రైతులు ఆందోళన చెందొద్దు
– గీతారెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
విత్తనాలు, ఎరువుల విషయంలో రైతులు ఆందోళన చెందొద్దు. వానకాలం సీజన్‌కు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాం. కొరత లేకుండా వారం వారం నిల్వలను ఇండెంట్ పెట్టి తెప్పిస్తున్నాం. తొమ్మిదేండ్లలో పెరిగిన సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
ఇప్పటివరకు 68,789 ఎకరాల్లో సాగు
వికారాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : జిల్లావ్యాప్తంగా వానకాలం 5,90,308 ఎకరాల్లో ఆయా పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేయగా, ఇప్పటివరకు 68,789 ఎకరాల్లో ఆయా పంటలకు సంబంధించి జిల్లా రైతాంగం విత్తనాలు నాటింది. ఈ వానకాలం సీజన్‌కు యూరియా, డీఏపీ, ఎన్పీకేఎస్, ఎంవోపీ, ఎస్ఎస్పీ ఎరువులన్నీ కలిపి 74,683 మెట్రిక్ టన్నులు అవసరమని జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా యూరియా 28,867 మెట్రిక్ టన్నులు, డీఏపీ 15,360., కాంప్లెక్స్ ఎరువులు 21,899., ఎంవోపీ 6206, ఎస్ఎస్పీ 2351 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని సంబంధిత అధికారులు నిర్ణయించారు.
ప్రతి నెలా అవసరమైన ఎరువుల కంటే అదనంగా 10 శాతం ఎరువులను జిల్లాలోని స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉంచుతున్నారు. జూన్ నెలకు సంబంధించి యూరియా, డీఏపీ, ఎన్పీకేఎస్, ఎస్ఎస్పీ ఎరువులు కలిపి 9778 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేయగా, ప్రస్తుతం జిల్లాలో 18,648 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాలో అందుబాటులో ఉన్నట్లు జిల్లా వ్యవసాయాధికారులు వెల్లడించారు. యూరియా-10,245 మెట్రిక్ టన్నులు, డీఏపీ-4281, ఎంవోపీ-141, కాంప్లెక్స్ ఎరువులు-3794, ఎస్ఎస్పీ-185 మెట్రిక్ టన్నులు జిల్లాలోని ఆయా ఎరువుల దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయి.
4,50,879 మెట్రిక్ ఎరువుల వినియోగం
జిల్లాలో ఇప్పటివరకు 4,50,879 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులు పంటలకు వినియోగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు ఏనాడు కూడా ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు ఎదుర్కోకపోవడం గమనార్హం. 2016-17లో 56,661 మెట్రిక్ టన్నులు, 2017-18లో 56,268., 2018-19లో 51,729., 2019-20లో 60,183., 2020-21లో 74,183., 2021-22లో 75,061., 2022-23లో 76,894 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులు వినియోగించారు.
వానకాలం సాగు 5,90,308 ఎకరాలు
ఈ వానకాలం సీజన్లో 5,90,308 ఎకరాల్లో ఆయా పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయాధికారులు అంచనాలను రూపొందించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు లక్ష ఎకరాలకుపైగా ఆయా పంటల సాగు అవుతుందని అంచనా వేశారు. వరి 95,690 ఎకరాలు, మొక్కజొన్న-54,322., జొన్న-2560., కందులు-1,60,824., పెసలు-12,690., మినుములు-5452., పత్తి-2,55,980., సోయాబీన్-2990 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేశారు. ఇప్పటివరకు మొక్కజొన్న-1500 ఎకరాలు, జొన్న-35., కందులు-15,696., పెసలు-4020., మినుములు-1049., పత్తి-45,820., సోయాబీన్-287 ఎకరాల్లో జిల్లా రైతాంగం సాగు చేసింది.
జిల్లా రైతాంగానికి సరిపడా ఎరువులు
– కలెక్టర్ నారాయణరెడ్డి
జిల్లాలో ఎరువుల కొరత లేకుండా, జిల్లా రైతాంగానికి ఇబ్బంది లేకుండా సరిపడా ఎరువులను జిల్లాలో అందుబాటులో ఉంచాం. ప్రతి నెలా అవసరానికి మించి ఎరువులు జిల్లాకు సరఫరా అవుతున్నాయి. ఎరువుల విక్రయాల్లో ఎలాంటి అవకతవకలు జరుగకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాం.
గతంలో చాలా ఇబ్బందులు పడేవాళ్లం
– బేగరి మల్లయ్య, రైతు, అంతారం, చేవెళ్ల మండలం
గత ప్రభుత్వాల హయాంలో రైతులు ఎరువులకు నానా అవస్థలు పడేవాళ్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ రైతుల పాలిట దేవుడిగా మారి ఎరువులకు ఎలాంటి కొరత లేకుండా ఇస్తున్నారు. ఇదివరకు అప్పులు చేసి ఎరువులు కొని పంటలు వేస్తే పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేదికాదు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా ముఖ్యమంత్రి రైతులకు ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నారు. రైతు బంధు పథకం ద్వారా నాకు పదివేల రూపాయలు సాయం అందింది. వ్యవసాయానికి పత్తి విత్తనాలు కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తాను. సీఎం కేసీఆర్ సారు సల్లగా ఉండాలని కోరుతున్నాను. మరలా కేసీఆర్ సారే ముఖ్యమంత్రి అవుతారు.
పుష్కలంగా దొరుకుతున్నాయి
– రంగయ్య, నాగన్‌పల్లి రైతు, (ఇబ్రహీంపట్నంరూరల్)
గతంలో దుక్కులు దున్ని పెట్టి ఎరువుల కోసం రోజుల తరబడి ఎదురుచూసేవాళ్లం. ఎరువులు దొరకక సమయం వృథా అయ్యేది.సమైక్య రాష్ట్రంలో ఎప్పుడు ఎరువులు కొందామన్న గంటల తరబడి దుకాణాల వద్ద లైన్ కట్టాల్సి వచ్చేది. నిలబడే ఓపిక లేనప్పుడు చెప్పులు వరుసలో పెట్టి పక్కన కూర్చునేది. అయినా సరైన సమయంలో ఎరువులు చేతికందేవి కావు. ఏమున్నా ఆంధ్రకు ముందు చూసుకున్నంకనే తెలంగాణకు ఇచ్చేవారు. కాని, ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఫెర్టిలైజర్ దుకాణానికి వెళ్లినా.. సహకార సంఘాలకు వెళ్లినా అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంటున్నాయి. ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
ఎరువులకు ఇబ్బందులు తొలగిపోయాయి
– సత్యనారాయణ, రైతు, కర్ణంగూడ (ఇబ్రహీంపట్నం)
ఎరువుల కోసం గతంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. కాని, పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆది నుంచి రైతాంగ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారు. రైతులకు రైతు బంధు అందించటంతోపాటు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతూ.. సబ్సిడీ ద్వారా అందిస్తున్న గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. నేడు ఎక్కడికి వెళ్లినా ఎరువుల ఇబ్బందులు లేవు. రైతుల సంక్షేమానికి కృషిచేస్తున్న ముఖ్యమంత్రి రుణం తీర్చుకోలేనిది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువులు సమయానికి దొరుకుతున్నాయి.
ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం
– బాలకృష్ణ, రైతు, కమ్మెట, చేవెళ్ల మండలం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఎరువుల కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎరువులు, మందులు, విత్తనాలు కొనుగొలు కోసం లైన్లో నిలబడి ఉండేవాళ్లం. ఓపిక లేక, నిలబడే సత్తువలేక చెప్పులు, సంచులు లైన్లో పెట్టిన పరిస్థితి. మూడు నాలుగు రోజుల వరకు దొరికేవి కావు. ఎరువుల కోసం వస్తే పోలీసులు రైతులపై కాల్పులు జరిపిన సంఘటనలున్నాయి. అట్లాంటి పరిస్థినుంచి నేడు రైతులకు పది నిమిషాల్లో కావలసిన విత్తనాలు, ఎరువులు లభిస్తున్నాయి. ప్రభుత్వ ముందు చూపు వల్లనే ఎరువుల సమస్యలు లేకుండా పోయాయి. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి.
ఎరువుల కోసం ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లం
– జంగ రాములు, రైతు, నందిగామ
గతంలో దుక్కులు దున్ని పెట్టి ఎరువుల కోసం రోజుల తరబడి ఎదురుచూసే వాళ్లం. ఎరువులు దొరకక సమయం వృథా అయ్యేది. చెప్పులను క్యూలో పెట్టి రోజుల తరబడి ఎదురుచూసేవాళ్లం. రైతు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువులు సమయానికి దొరుకుతున్నాయి. ప్రభుత్వ ముందు చూపు వల్లనే ఎరువుల సమస్యలు లేకుండా పోయాయి. రైతు బంధు పథకం ద్వారా వచ్చిన సాయం పత్తి విత్తనాలు కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తాను. మరలా కేసీఆర్ సారే ముఖ్యమంత్రి అవుతారు.
ఎరువుల బాధ తీరింది
– మధు, శంకర్పల్లి
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతులకు ఎరువుల బాధ తీరింది. గత ప్రభుత్వాల హయాంలో రెండు మూడు రోజులు లైన్లలో నిలబడి బండ్లు కట్టుకుని ఎరువుల బస్తాలను గ్రామాలకు తీసుకుపోయేవాళ్లం. ఇదివరకు అప్పులు చేసి ఎరువులు కొని పంటలు వేస్తే పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేదికాదు. ప్రస్తుతం పంటలకు కావాల్సిన ఎరువులు పుష్కలంగా లభిస్తున్నాయి. గతంలో డీలర్లు ఇచ్చిన ఎరువులే వాడేవాళ్లం నాసిరకమైన ఎరువులతో పంటలు సరిగా పండేవి కావు. నేడు అవినీతికి తావు లేకుండా కల్తీ లేని ఎరువులను అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. రైతుల సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌కు రైతులందరూ రుణపడి ఉండాలి. ప్రస్తుతం కేసీఆర్ రైతులకు ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నారు.
గతంలో ఎరువుల కోసం ఇబ్బందులు పడేవాళ్లం
– శంకర్, రైతు, షాద్‌నగర్ రూరల్
గత ప్రభుత్వాల హయాంలో ఎరువుల కోసం నానా ఇబ్బందులు ఎదుర్కునేవాళ్లం. ఎరువుల దుకాణల వద్ద రోజుల కొద్దీ పడిగాపులు కాసేవాళ్లం. అయినా ఎరువులు సకాలంలో దొరికేవి కావు. కానీ నేడు ఆ బాధ తప్పింది. సకాలంలో సరిపడా ఎరువులు లభిస్తున్నాయి. నాసిరకం కాకుండా నాణ్యమైన ఎరువులు లభ్యం కావడంతో పంటల దిగుబడి బాగుంది. కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం. నేడు సకాలంలో అవసరమైన నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుతున్నాయి. ప్రస్తుతం రైతులు మంచి దిగుబడి సాధిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. రైతులకు అన్ని విధాలా అదుకుంటున్న ఏకైక సీఎం కేసీఆర్. రైతుల పాలిట దేవుడిగా మారి ఎరువులకు ఎలాంటి కొరత లేకుండా ఇస్తున్నారు.
గత ప్రభుత్వాల కంటే చాలా బెటర్
– మంగళి నర్సింహులు, నక్కలపల్లి, మొయినాబాద్
గత ప్రభుత్వాల కంటే చాలా నయం. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా మేలు చేస్తున్నది. గతంలో ఎరువుల కోసం దుకాణాల వద్ద రోజుల తరబడి వేచి చూసేవాళ్లం. ఎరువులు తీసుకోవాలంటే ఎవుసం ఆపి వచ్చేవాళ్లం. పెట్టుబడికి లేక అప్పులు తెచ్చి ఎరువులు, విత్తనాలు కొనుగొలు చేసి పంటలు పండిస్తే అవి తెచ్చిన అప్పుకే సరిపోయేవి. అప్పులు తీర్చలేక పురుగుల మంది తాగి ఎంతోమంది రైతులు చనిపోయారు. ఇప్పుడు అప్పులు చేయకుండానే ప్రభుత్వం సాయం చేస్తున్నది. దీంతో పంట పండించుకుని రైతులు పిల్లాపాపలతో సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఏ సమయంలోనైనా వెళ్లి ఎరువులు తెచ్చుకోవచ్చు. రైతులకు సరిపడా కరెంట్ సరఫరా చేస్తున్నారు.
ఆనాడు కొనాలంటే కష్టం కాదు.. కన్నీటి గోసే..
– భీములు, రైతు, చిన్ననందిగామ, కొడంగల్
ఆనాటి బాధలు తలచుకుంటే కన్నీళ్లు రాక మానవు. విత్తనాలు, ఎరువుల కోసం అలసిపోయి చెప్పులు క్యూలో పెట్టి పడిగాపులు కాచేవాళ్లం. అప్పట్లో ఎవుసం చేయాలంటే వద్దురా దేవుడా అనుకునేవాళ్లం. కానీ నేడు సీఎం కేసీఆర్ పాలన వచ్చాక రైతుల బాధలు పూర్తిగా పోయి పూర్తి సౌకర్యాలతో వ్యవసాయం చేసుకుంటున్నాం. అనుకున్న సమయంలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటున్నాయి. ఏ కాలంలో రైతులకు ఏం కావాలో ముఖ్యమంత్రి గుర్తించి వాటిని సమకూర్చేలా సిద్ధం చేస్తున్నారు. ఆనాటి రోజులు తలచుకొని, నేటి రోజులను చూస్తుంటే నేటి సీఎం ఆనాడు ఎందుకు లేకపాయే అని బాధపడుతున్నాం. ప్రజల కష్టాలను తెలిసిన నాయకుడైతేనే ప్రజల కష్టాలు తీరుతాయి.
లైన్లో నిలబడినా ఎరువులు దొరికేవి కావు
– కిష్టారెడ్డి, చీమలదరి, మోమిన్‌పేట మండలం
కాంగ్రెస్ పాలనలో ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద రెండు రోజులు లైన్లో నిలబడినా ఎరువులు దొరికేవి కావు. ఎకరానికి కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇచ్చేవారు. దీంతో సకాలంలో విత్తనాలు నాటేందుకు వీలయ్యేదికాదు. పంట దిగుబడి సరిగా వచ్చేది కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. నేడు సకాలంలో అవసరమైన నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుతున్నాయి. ప్రస్తుతం రైతులు మంచి దిగుబడి సాధిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. రైతులకు అన్ని విధాలా అదుకుంటున్న ఏకైక సీఎం కేసీఆర్.
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్
– చెన్నారెడ్డి, నాగసముందర్, యాలాల మండలం
రైతులకు ఇది నిజంగా పండుగ రోజు. ప్రతి రైతు కండ్లల్లో ఆనందం చూడాలన్న కేసీఆర్ ఆకాంక్షల ఫలితమే రైతు బంధు. రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ అని నేడు మరోసారి రుజువైంది. 2018లో ప్రారంభించిన ఈ పథకం యావత్ భారతదేశాన్ని ఆకర్షించింది. వ్యవసాయ ఉత్పాదకత, రైతులకు ఆదాయాన్ని పెంచడానికి రైతు బంధు ఎంతో ఉపయోగపడుతుంది. అదునుకు అండగా రైతు బంధు పథకం నిలుస్తున్నది. కొత్తగా 5 లక్షల మంది పోడు రైతులకు ఈ పథకాన్ని ప్రభుత్వం వర్తింప చేయనుంది. వానకాలం సాగుకు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమకానున్నాయి. రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఫెర్టిలైజర్ దుకాణానికి వెళ్లినా.. సహకార సంఘాలకు వెళ్లినా ఎరువులు అందుబాటులో ఉంటున్నాయి.
రైతు సర్కార్.. మన ప్రభుత్వం
– కొండపల్లి అనిత, నాగసముందర్, యాలాల మండలం
విత్తనాలు, ఎరువుల కోసం అలసిపోయి చెప్పులు క్యూలో పెట్టి పడిగాపులు కాచేవాళ్లం. అప్పట్లో ఎవుసం చేయాలంటే వద్దురా దేవుడా అనుకునేవాళ్లం. కానీ నేడు సీఎం కేసీఆర్ పాలన వచ్చాక రైతుల బాధలు పూర్తిగా పోయి పూర్తి సౌకర్యాలతో వ్యవసాయం చేసుకుంటున్నాం. మన సర్కార్ రైతు ప్రభుత్వం. మాలాంటి సన్నచిన్నకారు రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.5 వేలు జమ కావడం ఆనందంగా ఉంది. ఏటా ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నది. రైతుల పక్షాన సీఎం కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు. ఇది సీఎం కేసీఆర్‌కు రైతుల పట్ల ఉన్న ఆప్యాయతకు నిదర్శనం. ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి
– పాండ్యానాయక్, సంఘాయిగుట్టతండా, యాలాల
ప్రతి రైతుకు రైతు బంధు ద్వారా పంట పెట్టుబడి సాయం అందించడమే కాకుండా ఎరువులను మాకు అందుబాటులో ఉంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని మరోసారి నిరూపితమైంది. గత ప్రభుత్వాల హయాంలో చెప్పులను క్యూలో పెట్టి రోజుల తరబడి ఎదురుచూసేవాళ్లం. రైతు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు యూరియా, డీఏపీ మార్కెట్లో ఎంత కావాలంటే అంత దొరుకుతున్నాయి. ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే సాధ్యమయింది. సాగు సమయంలో పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తున్నాను. రైతుల పక్షాన సీఎం కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు.
ఎరువులకు కొరత లేదు
– దశరథ్, గెరిగెట్పల్లి, వికారాబాద్
సమైక్య రాష్ట్రంలో ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు కాస్తేగాని ఎరువులు దొరకని పరిస్థితి. తిండి తిప్పలు మానేసేవాళ్లం. అరకొర సౌకర్యాలతో వ్యవసాయం చేస్తూ ఇబ్బందులు పడ్డాం. పంట పెట్టుబడికి ఇతరుల వద్ద అప్పులు చేసి పంటలు సాగు చేసుకునేవాళ్లం. ప్రస్తుతం కష్టాలు తీరిపోయాయి. ఎరువులు, విత్తనాలు దుకాణాల్లో పుష్కలంగా లభిస్తున్నాయి. ఎరువుల కొరత అనే మాటే లేకుండా చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ప్రస్తుతం పంటలకు కావాల్సిన ఎరువులు పుష్కలంగా లభిస్తున్నాయి. అవినీతికి తావు లేకుండా కల్తీ లేని ఎరువులను అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.
ఎరువుల కోసం రాత్రంతా మేలుకునేవాళ్లం
– రవీందర్‌గౌడ్, గూడూరు, కొత్తూరు మండలం
రాష్ట్ర ఏర్పడక ముందు ఎరువులు కొనాలంటే రాత్రంగా లైన్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చేది. ఏ అర్ధరాత్రో వచ్చి లైన్లో నిలబడితే మరసటి రోజు సాయంత్రం వరకు రెండు మూడు యూరియా బస్తాలు దొరికేవి. లైన్లో నిలబెట్టడానికి పోలీసులు వచ్చేవారు. కానీ రాష్ట్రం ఏర్పడి సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు యూరియా, డీఏపీ మార్కెట్లో ఎంత కావాలంటే అంత దొరుకుతున్నాయి. ఫోన్ చేస్తే చాలు ఇంటికి పంపుతున్నారు. ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే సాధ్యమయింది. సీఎం కేసీఆర్ వల్ల వ్యవసాయం చేయాలనే ఉత్సాహం పెరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువులు సమయానికి దొరుకుతున్నాయి.