క్రిస్మస్ కానుకలొచ్చాయ్.. రంగారెడ్డి జిల్లాలోని అర్హులైన 19,500 మంది నిరుపేదలకు పంపిణీ చేసేందుకు మైనార్టీ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. 36 చోట్ల క్రిస్మస్ విందులకూ ప్రభుత్వం రూ.39 లక్షలను కేటాయించింది. గిఫ్ట్‌లను పంపిణీ చేసేందుకు నియోజకవర్గాలకు ప్రత్యేకాధికారులను నియమించింది. పేదలు దసరా, రంజాన్, క్రిస్మస్ వేడుకలను సంతోషంగా నిర్వహించుకోవాలన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆనవాయితీనే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఈ గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణీ కార్యక్రమం కలెక్టర్ పర్యవేక్షణలో జరుగనున్నది. త్వరలో ఈ గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేసేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
– రంగారెడ్డి, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : ‘జిల్లాకు క్రిస్మస్ గిఫ్ట్‌లు వచ్చేశాయి. అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేసేందుకు జిల్లా మైనార్టీ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో మొత్తం 19,500 మందికి గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేయనున్నారు. 36 చోట్ల క్రిస్మస్ విందుల నిర్వహణకు ప్రభుత్వం రూ.39లక్షల ను కేటాయించింది. పంపిణీ కోసం నియోజకవర్గాలకు ప్రత్యేకాధికారులను నియమించగా.. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగనున్నది. నిరుపేదలు దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగలను సంతోషంగా జరుపుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయా పండుగలకు దుస్తులను పంపిణీ చేస్తూ వచ్చింది. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం పాత సంప్రదాయాన్నే కొనసాగించి క్రిస్మస్ పండుగకు గిఫ్ట్ ప్యాక్‌లను అందజేయడంతోపాటు, విందులను నిర్వహిస్తున్నది.’
జిల్లాలో మొత్తం 19,500 మందికి క్రిస్మస్ గిఫ్ట్‌లను పంపిణీ చేయనున్నారు. ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, చేవెళ్లలలో నియోజకవర్గానికి 1,000 మంచి చొప్పున ప్యాక్‌లను అందజేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మహేశ్వరం, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో 33 చోట్ల దుస్తులను పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఒక్కోచోట 500 చొప్పున 16,500 గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేస్తారు. క్రిస్మస్ విందుకు ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, చేవెళ్ల నియోజకవర్గాలకు రూ.2లక్షల చొప్పున రూ.6లక్షలను ప్రభుత్వం కేటాయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కో చోట విందు నిర్వహణకు రూ. లక్ష చొప్పున 33 చోట్ల విందు కోసం రూ.33లక్షలను ప్రభుత్వం వెచ్చిస్తున్నది.
క్రిస్మస్ కానుకుల పంపిణీ కోసం క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆర్గనైజింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో పాస్టర్లతోపాటు అధికారులకు స్థా నం కల్పించారు. ఈ కమిటీకి నోడల్ అధికారిగా ఆర్డీవోలు, ప్రత్యేకాధికారులుగా తహసీల్దార్లు వ్యవహరిస్తారు. ఈ కమిటీల ఆధ్వర్యంలో ప్ర జాప్రతినిధులు గిఫ్ట్‌ప్యాక్‌లను పంపిణీ చేయనున్నారు. ఒక్కో కిట్‌లో చీర, ప్యాంట్, షర్ట్‌తోపాటు యువతుల కోసం డ్రెస్ మెటీరియల్‌ను అందజేస్తున్నారు. స్థానిక పాస్టర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులను పంపిణీ కార్యక్రమాల్లో భాగస్వామ్యులను చేసి పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో రేపటి నుంచి గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీని ప్రారంభించే అవకాశం ఉందని సంబంధిత శా ఖ అధికారులు చెబుతున్నారు.