‘రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రభుత్వం భూములు సేకరించగా.. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.. మేం అధికారంలోకి వస్తే ఎవరి భూములు వారికి తిరిగి ఇప్పిస్తామని, ఫార్మాసిటీని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.. తీరా అధికారంలోకి వచ్చాక రైతులకు సమాధానం చెప్పలేక మొహం చాటేస్తున్నారు..’అని జిల్లా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
– రంగారెడ్డి, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ)
జిల్లాలోని యాచారం, కందుకూరు మండలాల పరిధిలో ఏర్పాటు కానున్న ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ఉద్యమం చేసేందుకు ఈ ప్రాంతవాసులు రంగం సిద్ధం చేశారు. రైతులతో పాటు స్వచ్ఛంద సంస్థలు, విద్యావంతులు, మేధావుల భాగస్వామ్యంతో 13 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. సమన్వయకర్త కోల సరస్వతి, కుందారపు నారాయణల ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఫార్మా ఏర్పాటు కోసం గతంలో కుర్మిద్ద, మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి గ్రామాల్లో 14,029 ఎకరాల భూసేకరణ కూడా దాదాపుగా పూర్తయ్యింది. ఇందులో పట్టా భూములు 7,311 ఎకరాలు, ప్రభుత్వం భూములు 6,786 ఎకరాలుగా ఉన్నట్లుగా గుర్తించారు. కందుకూరు, కడ్తాల్ మండలాల్లో 13,500 ఎకరాల పట్టా భూములను సేకరించారు. అప్పట్లో ఫార్మాను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమానికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపడంతో అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి సైతం పొందింది.
మొహం చాటేసిన కాంగ్రెస్ నాయకులు..
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని, భూములను తిరిగి రైతులకు ఇప్పిస్తామని హామీ ఇచ్చి విస్మరించారు. అధికారంలోకి వచ్చాక ఫార్మాసిటీని రద్దు చేయకపోగా, పెట్టుబడుల కోసం ప్రముఖ ఔషధ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ నాయకులను జిల్లా రైతులు నిలదీస్తుండడంతో తమకేమీ పట్టనట్లుగా పక్కకు తప్పుకుంటున్నారు. ఇదేనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీకి విలువ అని ప్రశ్నిస్తుండడంతో మొహం చాటేస్తున్నారు. ఏదిఏమైనా మా భూములు మాకు కావాలని త్వరలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల కార్యాలయాల ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని జిల్లా రైతులు పేర్కొంటున్నారు.