రంగారెడ్డి, మే 9 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. జిల్లా లో రోజుకో చోట లంచాలు తీసుకుంటూ పలువురు అధికారు లు ఏసీబీకి పట్టుబడుతున్నా అవినీతి మాత్రం ఆగడంలేదు. దీంతో ఏసీబీ అధికారులు జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. రెండురోజుల కిందట తలకొండపల్లి మండలంలోని వెల్జాల్ గ్రామంలో ఓ ఇంటిస్థలం ఆన్లైన్ చేసేందుకు రూ. 20 వేలు తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడిన విషయం మరువక ముందే ఏసీబీ అధికారులు శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఆకస్మికంగా దాడులు జరిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఆఫీసులోని ఫైళ్లను పరిశీలించి.. కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. అలా గే, సోమవారం కూడా మరోమారు ఆ కార్యాలయంలో తనిఖీలు చేయాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలోని రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి పెచ్చుమీరిపోతున్నది. భూభారతిలో పెట్టుకున్న దరఖాస్తుల్లో ముఖ్యంగా నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించటంతోపాటు మ్యుటేషన్లు, కోర్టు కేసులకు సంబంధించిన వివాదాలు వంటి సమస్యలపై గతంలో ప్రభుత్వం నిర్వహించిన భూసదస్సుల్లో సుమారు 12 వేలకు పైగా దరఖాస్తులొచ్చాయి. ఆ తర్వాత ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలోనూ రెవెన్యూ పరమైన సమస్యలు పెద్ద ఎత్తున అధికారుల దృష్టికి వచ్చాయి. వాటిని పరిష్కరించేందుకు రెవెన్యూ సిబ్బంది పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారు.
శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఏం జరుగుతున్నది..?
శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఏం జరుగుతుందోనన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంపై దాడిచేసి సుమారు పదిగంటలపాటు కార్యాలయ తలుపులు మూసేసి సిబ్బందిని బయటికి వెళ్లనివ్వకుండా ఫైళ్లను తనిఖీ చేశారు. ఇక్కడ భూసమస్యలకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నదని కొందరు ఏసీబీని ఆశ్రయించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది బాధితులతో మాట్లాడిన పలు ఆడియో రికార్డులు ఏసీబీ వద్ద ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆ అధికారులు ఆయా ఫైళ్లకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు దాడులు జరిపారు. శం షాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో భూసమస్యల పరిష్కారానికి బాధితులు రెవెన్యూ అధికారులను సంప్రదించగా…వారు పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేసినట్టు తెలిసింది. కొంతమంది సిబ్బంది బాధితుల నుంచి లంచాలు తీసుకున్నట్టు ఆధారాలు ఏసీబీకి లభించాయి. దీంతో ఏసీబీ అధికారులు రోజంతా తనిఖీలు నిర్వహించినా ఆ సమాచారాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా ఆయా కేసులకు సంబంధించిన ఫైళ్లనూ క్షుణంగా పరిశీలించినట్టు సమాచారం.