చేవెళ్లటౌన్, జూన్ 26: విద్యారంగంపై కాంగ్రస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఏబీవీపీ చేవెళ్ల నగర కార్యదర్శి మహిపాల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించాలని బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలోను బంద్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తూ పేదలకు ఉచిత విద్య అందకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో బుక్స్, స్టేషనరీ, యూనిఫాం, షూస్ పేర్లతో చేస్తున్న వ్యాపారాన్ని ప్రభుత్వం అరికట్టి విద్యార్థుల తల్లితండ్రులను ఆదుకోవాలని కోరారు. విద్యా హక్కు చట్టం పేదల కోసం 25 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు రాఘవేందర్, ప్రదీప్, ప్రేమ్, శివ, శ్రీనాథ్, రేవంత్, శివ, ఆనంద్, మహేశ్, శ్రీనివాస్, సంతోష ఉన్నారు.
షాద్‌నగర్‌టౌన్ : ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించాలని, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో అధిక ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బంద్‌లో భాగంగా బుధవారం షాద్‌నగర్ పట్టణంలోని పాఠశాలల బంద్‌ను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వాలు మారుతున్న విద్యావ్యవస్థలో మార్పు రాలేదని, కనీసం డీఈవో, ఎంఈవో పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధం కావడం లేదన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సూర్యప్రకాశ్, భాను, జగదీశ్, నవీన్, మహేందర్, సాయి, నవీన్, నాని, ఓంప్రకాశ్, శ్రీదత్తు, అక్షయ్, సాయి, ప్రణిత్, అమరేందర్, పవన్, శరత్ పాల్గొన్నారు.
షాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించాలని బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా షాబాద్ మండలంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను బంద్ చేయించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు బర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ… తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలు ప్రారంభమై 15రోజులు పూర్తవుతున్నా ఇంతవరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పూర్తి స్థాయిలో అందించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో రూ.లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ విద్యా వ్యాపారాలకు పాల్పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వీటిని నియంత్రించాలని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా బుక్స్, స్టేషనరీ, యూనిఫాం, షూస్ పేర్లతో చేస్తున్న వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ ద్వారా 25వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నగర కార్యదర్శి విజయ్‌కుమార్, నాయకులు కుమార్, ప్రవీణ్, సంగమేశ్వర్, శివ, శ్రీకాంత్ పాల్గొన్నారు.
పెద్దఅంబర్‌పేట : ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ నిర్వహించారు. కార్యక్రమంలో యువజన నాయకులు మద్ది నిఖిల్, భానుచందర్, వడ్డేపల్లి శివ, సుర్వి కిశోర్, ప్రవీణ్‌కుమార్, జుబేర్‌ఖాన్ పాల్గొన్నారు.
కొత్తూరు : మండల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఏబీవీపీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్ మేరకు బుధవారం మూసివేయించారు. కార్యక్రమంలో ఏబీవీపీ కొత్తూరు మండల కన్వీనర్ సురేశ్‌చారి, ఏబీవీపీ కో కన్వీనర్ శివకుమార్ చారి, సుమిత్, నాని, జస్వంత్, కృష్ణ, ఉదయ్, హర్షవర్ధన్ పాల్గొన్నారు.