చేవెళ్ల రూరల్, సెప్టెంబర్ 21 : మండల పరిధిలో యాసంగి సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. వర్షాలు పుష్కలంగా కురువడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీనికి తోడు రైతు బంధు సాయం సకాలంలో అందుతుండంతో రైతులు రెట్టింపు ఉత్సాహంతో పంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. యాసంగి సాగు అక్టోబర్ నుంచి జనవరి నెల వరకు కొనసాగుతుంది. దీంతో రైతులు పంటలకు సన్నద్ధమయ్యే సమయానికి రైతు బంధు సాయం కూడా విడుదలవుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైతు బంధు డబ్బుతో మేలు రకం విత్తనాలు, ఎరువులు కొని వ్యవసాయాన్ని ధీమాగా కొనసాగిస్తున్నారు.
మండలంలో సాగు విస్తీర్ణం
మండలంలో ఈ యాసంగి సాగుకు దాదాపు 16 వేల ఎకరాల్లో పంటలు సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. యాసంగి పంటలైన శనగలు, కుసుమలు, కూరగాయల పంటలు క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ తదితర పంటలు సాగు చేసేందుకు రైతులు ప్రణాథికలు రూపొందిస్తున్నారు. మేలు రకం విత్తనాలు, ఎరువులు అందేలా మండల వ్యవసాయ అధికారులు కృషి చేస్తున్నారు.
వర్షాలు సమృద్ధిగా కురువడంతో..
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతులు వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. రైతు బంధు డబ్బు సకాలంలో అందడంతో పెట్టుబడికి ఇబ్బందులు లేకపోవడంతో రైతులు ఉత్సాహంతో వ్యవసాయం చేస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురువడంతో భూగర్భ జలాలు అధికంగా పెరిగాయి. వచ్చే నెల నుంచి యాసంగి పంటలకు సిద్ధమవుతున్నారు. ఎరువులు సకాలంలో అందించడం, నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించేలా కృషి చేస్తున్నాం.
– తులసి, చేవెళ్ల మండల వ్యవసాయ అధికారి