పెద్దఅంబర్‌పేట, అక్టోబర్ 7: మున్సిపాలిటీలో భారీ వానలు పడుతున్నాయి. వారం రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో మున్సిపాలిటీలోని వివిధ చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతున్నది. దీంతో పలు చెరువులు అలుగు పారుతున్నాయి. కుంట్లూరు చెరువు నిండికుండలా మారింది. తట్టిఅన్నారంలోని ఊర చెరువులోకి భారీగా వరద నీరు చేరుతున్నది. చెరువు కింద ఉన్న రాఘవేంద్రనగర్, మారుతీనగర్ తదితర కాలనీల్లోకి నీరు ప్రవహిస్తున్నది.
కడ్తాల్ మండలంలో..
కడ్తాల్, అక్టోబర్ 7: మండలంలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా భారీ వానలు కురిశాయి. మండల కేంద్రంతోపాటు గ్రామాల్లోని చెరువులు, కుంటలు వరద నీటితో నిండుకుండల్లా మారి కళకళలాడుతున్నాయి. గుర్లకుంట, ఉప్పారాశి కుంట, దేవరా చెరువు, నాగిరెడ్డి కుంటలు నిండి అలుగుపారుతున్నాయి. శుక్రవారం కడ్తాల్ గ్రామంలోని గుర్లకుంట చెరువు వద్ద అలుగు నుంచి వస్తున్న నీటిలో చేపలు పట్టడానికి యువకులు పోటీ పడ్డారు.
తట్టిఅన్నారంలోని చెరువులోకి భారీగా చేరిన నీరు
నందివనపర్తి కాముని చెరువుకు పూజలు
యాచారం, అక్టోబర్ 7 : మండలంలోని నందివనపర్తి గ్రామంలోని కాముని చెరువు ఎన్నో ఏండ్ల తరువాత అలుగుపారడంతో గ్రామస్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చెరువు వద్దకు తరలివెళ్లారు. శుక్రవారం జ్ఞాన సరస్వతి సేవా సమితి ఆధ్వర్యంలో ఫౌండర్ సదావెంకట్రెడ్డి సమక్షంలో కాముని చెరువుకు పురోహితులు వేద మంత్రాల నడుమ పూలు, పండ్లు, పసుపు కుంకుమలను గంగమ్మకు సమర్పించి హారతి అందజేశారు. ఈ సందర్భంగా సదా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల తరువాత కాముని చెరువు అలుగుపారడం సంతోషకరమన్నారు. చెరువు శిఖం భూములు కబ్జాలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ విజయ్‌కుమార్, కారోబార్ మహేందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ముత్తడి దుంకుతున్న గార్ల చెరువు
కొత్తూరు, అక్టోబర్ 7: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండల పరిధిలోని కొడిచెర్ల గార్ల చెరువు అలుగు పారింది. దీంతో ఎంపీటీపీ రవీందర్‌రెడ్డి చెరువు వద్ద శుక్రవారం పూజలు చేశారు. ఈ పూజల్లో వార్డు మెంబర్లు నవీన్, శేఖర్, గ్రామస్తులు మోహన్‌రెడ్డి, జంగయ్య, సురేందర్, నరేందర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, దశరథచారి, శ్రీశైలం పాల్గొన్నారు.