రంగారెడ్డి, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం సాగు నీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. కరువుకు పాతరేసేలా కొత్త ప్రాజెక్టులను చేపట్టడంతోపాటు, గత ప్రభుత్వాల హయాంలో నిలిచిపోయిన పెండింగ్ ప్రాజెక్టులకు రీడిజైనింగ్ చేయిస్తున్నది. ఇందులో భాగంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రోజుకు 1.5 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టు నిర్మాణానికి అడుగడుగునా ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేసినా.. కేంద్రం ఎన్ని కొర్రీలు పెట్టినా.. సీఎం కేసీఆర్ పట్టువీడని విక్రమార్కుడిలా కృషి చేయడం వల్ల ఇటీవల పర్యావరణ అనుమతులకు ఎకనామిక్ అడ్వైజరీ కమిషన్(ఈఏసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు రావడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లావాసులు గత రెండు రోజులుగా సంబురాలు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ సంకల్పం, కృషిని సబ్బండ వర్ణాలు పొగుడుతున్నాయి. దశాబ్దాల నాటి కల సాకారం కానుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పల్లెకూ సాగు, తాగునీరు అందనున్నదన్న సంతోషంతో కృతజ్ఞతగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. ఎత్తిపోతల పథకం పనులు పూర్తైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 6.18 లక్షల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. అధికంగా వికారాబాద్ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. ఇప్పటికే కాలువల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5180 కోట్ల నిధులు కేటాయించగా, త్వరలో ఉద్దండాపూర్ నుంచి వికారాబాద్ జిల్లాకు కాలువల పనుల కోసం టెండర్ల ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు.
‘పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై ప్రతిపక్ష నేతల కుట్రలు పటాపంచలు అయ్యాయి. రెండో దశలో చేపట్టబోయే సాగు నీటి పనులకు సంబంధించి పర్యావరణ అనుమతులకు లైన్ క్లియర్ అయ్యింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సాగు, తాగు నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపనుండడంతో సబ్బండ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 6.18 ఎకరాలు సస్యశ్యామలం కానున్నది.
ఎత్తిపోతల పథకానికి పచ్చజెండా…
సీఎం కేసీఆర్ మొక్కవోని సంకల్పం సిద్దించింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఈఏసీ పచ్చజెండా ఊపింది. దీంతో మొదటి, రెండో దశ పనులు ఊపందుకోనున్నాయి. త్వరలోనే ఉద్దండాపూర్ జలాశయం నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీటిని తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 6.18లక్షల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
కుట్రలను ఛేదించి అనుమతులు..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే ప్రభుత్వం సాగు నీటి రంగానికే అధిక ప్రాధాన్యత ఇచ్చింది. సీఎం కేసీఆర్ కొత్త ప్రాజెక్టులను చేపట్టడంతోపాటు, గత ప్రభుత్వాల హయాంలో నిలిచిపోయిన పెండింగ్ ప్రాజెక్టులకు రీడిజైనింగ్ చేయించి సాగు, తాగు నీటి సమస్యలకు పరిష్కారం చూపేలా ముందుకు సాగారు. ఈ క్రమంలోనే శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా రోజుకు 1.5టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా..పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కార్యరూపం ఇచ్చి 2015లో ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ ఎత్తిపోతలను అడ్డుకునేందుకు ప్రతపక్ష పార్టీలు ఎన్నో కుట్రలు చేశాయి. కేంద్రం అనేక కొర్రీలు పెట్టింది. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పర్యావరణ అనుమతుల కోసం పట్టుదలతో కృషి చేసింది. ఎట్టకేలకు సీఎం కేసీఆర్ సంకల్పం ఫలించి పర్యావరణ అనుమతులకు ఎకనామిక్ అడ్వైజరీ కమిషన్(ఈఏసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కరువు ప్రాంతం సస్యశ్యామలం…
తాగు, సాగు నీరందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికతో పనులను చేపడుతున్నారు. ఎత్తిపోతల పథకం పూర్తయితే చేవెళ్ల నియోజకవర్గంలో 1,24,714 ఎకరాలకు, షాద్‌నగర్ నియోజకవర్గంలో 79,996, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 69,057, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 8,972 ఎకరాలు, మహేశ్వరం నియోజకవర్గంలో 39,137, పరిగి నియోజకవర్గంలో 90,028, వికారాబాద్ నియోజకవర్గంలో 94,871, తాండూరు నియోజకవర్గంలో 1,02,797 ఎకరాలకు సాగు నీరందించనున్నారు.
వికారాబాద్, ఆగస్టు 13, (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని అందించేందుకుగాను గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేసింది. జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తూ సంబురాలు నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులకు అడ్డంకులు తొలిగిపోవడంతో ప్రాజెక్టు పనులు మరింత జోరందుకోనున్నాయి.
పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకునేందుకు అడగడుగునా కాంగ్రెస్ పార్టీ నేతలు వేసిన కేసులన్నీ కొట్టేయడంతో పనుల్లో వేగం పెరిగింది.
ప్రాజెక్టు ద్వారా సాగునీటితోపాటు తాగునీటిని కూడా అందించనున్నారు. ఇప్పటికే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా తాగునీరందించే పనులు శరవేగంగా కొనసాగుతుండగా, తాజాగా సాగునీటి పనులు చేపట్టేందుకు కూడా పర్యావరణ అనుమతులిచ్చేందుకు ఈఏసీ నిర్ణయంతో సాగునీరందించే పనులు కూడా శరవేగంగా జరుగనున్నాయి.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా వికారాబాద్ జిల్లాతోపాటు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సాగు నీరందనున్నది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీటిని పంపింగ్ చేయనున్నారు. తొలుత శ్రీశైలం నుంచి నాగర్‌కర్నూల్ జిల్లాలోని నార్లపూర్ రిజర్వాయర్‌కు తదనంతరం నాగర్‌కర్నూల్ జిల్లాలోని వట్టెం రిజర్వాయర్, ఆ తర్వాత వనపర్తి జిల్లాలోని ఏదుల రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోయనున్నారు. తదనంతరం మహబూబ్‌నగర్ జిల్లాలోని కరివెన రిజర్వాయర్‌కు అక్కడి నుంచి ఉద్దండపూర్ రిజర్వాయర్ ద్వారా జిల్లాకు నీటిని ఎత్తిపోయనున్నారు. ఉదండపూర్ద్ రిజర్వాయర్ నుంచి జిల్లాకు తాగు, సాగు నీరందించనున్నారు. మరోవైపు సాగునీటిని అందించేందుకు పర్యావరణ అనుమతులు వచ్చిన దృష్ట్యా 100 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఎడమ కాలువ కింద జిల్లాలోని సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందనున్నది.
నియోజకవర్గాల వారీగా..
జిల్లాలోని పరిగి, తాండూరు, వికారాబాద్ వరకు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా సాగు నీటిని అందించనున్నారు. పరిగి నియోజకవర్గంలో 80వేల ఎకరాలకు, తాండూరు నియోజకవర్గంలోని 1,02,797 ఎకరాలు, వికారాబాద్ నియోజకవర్గంలోని 89,287 ఎకరాలు, చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట మండలంలోని 900 ఎకరాలు, కొడంగల్ నియోజకవర్గంలోని 90వేల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. అంతేకాకుండా సంబంధిత ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లోని 910 హబిటేషన్లకు తాగునీరందించనున్నారు.
లక్షల ఎకరాలకు సాగునీరు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. కాలువల ద్వారా నీళ్లు అందించి పంటలు సాగు చేసుకునే విధంగా ప్రాజెక్టులు కట్టి నీళ్లు అందిస్తామని సీఎం కేసీఆర్ గతంలో చెప్పారు. చెప్పిన విధంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా లక్షల ఎకరాలలో పంటలు సాగు చేసుకోవచ్చు. రైతులకు కరెంటు మోటర్లు అవసరం లేకుండా కాలవల ద్వారా పంటలు సాగుచేసుకునేందుకు వీలుంటుంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కృషి చేసిన సీఎం కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు.-చాకలి నర్సింహులు, రైతు మర్పల్లి
రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతారు
తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడడానికి కేసీఆర్ సారు మాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ద్వారా నీరందించడం చాలా సంతోషం. సాగు నీరు పుష్కలంగా అందడం వల్ల వ్యవసాయం మరింత విస్తరిస్తుంది. దీంతో ప్రతి రైతు ఆర్థికంగా బలోపేతం అవుతారు. బకాయి ఉన్న రుణాలతో భారం ఉన్న రైతులకు ఈ సాగు నీటితో ద్వారా వ్యవసాయం వృద్ధి చెంది అప్పుల బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది.
– ఏర్పుల బూవమ్మ,
కోకట్, మండలం యాలాల పుష్కలంగా సాగు నీరు..
పాలమూరు- రంగా రెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇక్కడి రైతులు వ్యవసాయం చేసుకునేందుకు సాగు నీరు పుష్కలంగా అందుతుంది. ఇప్పటికే మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేయడంతో భారీ వర్షాలతో చెరువులు నిండి బోరుబావుల్లో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. పాలమూరు-రంగారెడ్డి పథకానికి పర్యావరణ అనుమతులు లభించడం ఎంతో శుభసూచికం. ఇది రాష్ట్ర ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం. దేశంలో ఎక్కడాలేని విధంగా సాగునీటి రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని చెప్పడానికి ఇది ఎంతో నిదర్శనం.
– శ్రీధర్‌గౌడ్, నాగారం గ్రామం, ధారూరు మండలం
దేశానికే గర్వకారణం
ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో నిర్మించతలపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఎంతోమంది రైతుల జీవితాల్లో వెలుగులు నిండనున్నది. ఇంతగొప్ప నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. పాలమూరు రంగారెడ్డి పథకాన్ని అడ్డుకోవాలని ఎవరెన్ని కుట్రలు చేసినా చివరకు మంచే గెలిచింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన పాలమూరు రంగారెడ్డికి పర్యావరణ అనుమతులు లభించటం ఎంతో గర్వకారణం.
– వంగేటి లక్ష్మారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు (ఇబ్రహీంపట్నం)
అనుమతులు రావడం సంతోషకరం..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కావలసిన అన్ని అనుమతులు రావడం సంతోషంగా ఉంది. ప్రాజెక్టు పూర్తి అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలోని రైతులకు సాగు నీరు, తాగు నీరు అందనున్నది. బీళ్లు వారిన పొలాలకు నేడు ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు రానుండడం సంతోషంగా ఉంది. వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేసి రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం.
– బాలకృష్ణ, రైతు, కమ్మెట గ్రామం, చేవెళ్ల
హర్షణీయం..
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావడం హర్షణీయం. సీఎం కేసీఆర్ కరువు నేలకు నీరు తెప్పించేందుకు చేసిన కృషికి ఫలితం నేడు దక్కడం శుభపరిణామం. రైతులకు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎంతో మేలు చేకూరనున్నది. యావత్ రైతాంగం సీఎం కేసీఆర్ పేరు గుర్తు పెట్టుకుంటారు.
– చిలుకల వెంకటయ్య, రైతు, కౌకుంట్ల , చేవెళ్ల మండలం
సాగునీటి కష్టాలు తీరుతాయ్..
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సాగునీటి కష్టాలు తీర్చి రైతులు సుభిక్షంగా ఉండాలన్న సంకల్పంతో ఎన్నో ఏండ్లుగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పడుతున్న కష్టానికి త్వరలో ఫలితం దక్కనుంది. పాలమూరు రంగారెడ్డి ద్వారా ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని చెరువులు, కుంటలను నీటితో నింపి ఈ ప్రాంతం సుభిక్షంగా మారనున్నది. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరువకు ఫలితం దక్కనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– నిట్టు జగదీశ్వర్, (ఇబ్రహీంపట్నం)