యాచారం, జూలై8 :బైక్ను కారు ఢీ కొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డమల్లయ్యగూడ గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ లింగయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామానికి చెందిన గునగోని మహేష్ (23) తన యూనికార్న్ (టీఎస్07ఎచ్డీ5509)పై హైదరాబాద్ నుంచి గున్గల్ మీదుగా శివన్నగూడకు వెళ్తున్నాడు. అదే సమయంలో మంచాల మండలం ఎల్లమ్మతండా నుంచి ఎదురుగా వస్తున్న ఓ షిప్టు కారు (ఏపీ28 డీఈ 7773) మహేష్ బైకును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మహేష్ తీవ్రంగా గాయపడ్డాడు. మహేష్ తలకు తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించి దవాఖానాలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.