– మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
– ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం
ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 12 : ఈ నెల 11న జరిగిన ఏదులాపురం మున్సిపల్ వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు రెండు రౌండ్లలో 16 టేబుళ్ల యందు ప్రక్రియ పూర్తి కానుంది. ఇప్పటికే ఓట్లకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్ కు చేరుకోవడం జరిగింది. మొత్తం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో 32 వార్డులు ఉండగా ఒక వార్డు ఏకగ్రీవం కావడంతో 31 వార్డులకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే పోలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో జరగనుంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ప్రక్రియ ఏర్పాట్లను సంబంధిత మున్సిపల్ ఎన్నికల అధికారులు పూర్తి చేశారు. ఒక్క రౌండ్లో 16 టేబుళ్ల ద్వారా 16 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది. రెండవ రౌండ్లో 15 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపట్టే విధంగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
ఉదయం 7 గంటల లోపు ఆయా వార్డులలో పోటీలో ఉన్న అభ్యర్థులు వారికి సంబంధించిన ఏజెంట్లు కౌంటింగ్ హాలుకు చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. అనంతరం 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి అయిన వెంటనే 16 టేబుళ్ల ద్వారా 16 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రెండు రౌండ్లు ఓట్ల లెక్కింపు ఇంచుమించు మధ్యాహ్నం లోపు పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ఇటు ఎన్నికల అధికారులు అటు పోలీస్ అధికారులు పూర్తి బందోబస్తు నిర్వహించనున్నారు. సాయంత్రం లోగా ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థుల వివరాలు అధికారికంగా వెల్లడి కానుంది.