ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రేవంత్ ప్రభుత్వం కమిటీలు, ఉప కమిటీలు, అఖిలపక్ష సమావేశాలు, ఉద్యమకారుల అభిప్రాయ సేకరణలు అంటూ కాలయాపన చేస్తున్నది. ఎందుకంటే.. ఇదివరకు తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాంటి కమిటీలు వేస్తూ ఆంధ్ర లాబీయింగ్‌తో మనను ఎన్నిసార్లు దగాపరిచిండ్రో తెలిసిన విషయమే. వాస్తవానికి అప్పుడు కమిటీలతో మనకు ఒరిగిందేమీ లేదు. అసలు మనకు కావలసింది తెలంగాణ ఆవిర్భావం. అదేవిధంగా ప్రస్తుతం ఉద్యమకారులకు అవసరమైనవి కమిటీలు కాదు. ఉద్యమకారులకు ఏమిస్తారు? ఏది చేస్తారు? ఎవరికి ఇస్తారు? అనే ఒక నిర్దిష్టమైన నిర్ణయం ప్రకటించాలి. ప్రభుత్వం ఒకవైపు అందరికీ ఇవ్వలేం అంటూనే ఎవరికి ఇస్తామో అని కూడా చెప్పటానికి ముందుకు రావడం లేదు. కనీసం ఉద్యమకారుల ఎంపికకు స్పష్టమైన విధివిధానాలు కూడా ప్రకటించడం లేదు. అయితే మొదట గుర్తింపు రావాల్సింది అమరవీరుల కుటుంబాలకని మనం ఎప్పటినుంచో అంటున్నమాటే.
వాస్తవానికి ఉద్యమంలో అమరులైన ఉద్యమకారుడి కుటుంబాల్లో ఇంటికొక ఉద్యోగం వంతున 550 మంది కళాకారులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో సాంస్కృతిక సారథి కింద ఉద్యోగావకాశాలు కల్పించారు. ప్రత్యక్షంగా ఉద్యమ పార్టీలో పోరాడిన వారికి సర్పంచులుగా, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం ఇచ్చింది కేసీఆర్ సర్కారే. సకల జనుల సమ్మె చేసిన ఆర్టీసీ ఉద్యోగులకు అదనంగా 2 డీఏలు, రూ.250 స్పెషల్ ఇంక్రిమెంట్, సమ్మె కాలానికి జీతం సహా గత సర్కార్ ఇచ్చిందనే విషయం కాదనలేని సత్యం.
నెలల తరబడి జైళ్లలో ఉన్నవారికి, లాఠీదెబ్బలు తిని, ఎఫ్ఐఆర్లతో పోలీసు కేసులు ఎదుర్కొన్న వారికి, విద్యా సంవత్సరంలో విలువైన సమయం కోల్పోయి, ఉద్యోగాలు విద్యావకాశాలు కోల్పోయిన విద్యార్థులకు, ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన కవులు, కళాకారులు, జర్నలిస్టులకు కూడా గుర్తింపు ఇవ్వాల్సి ఉన్నది. ఇలాంటి వారికి కూడా మేలు చేకూర్చేందుకు ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఎటువంటి తీర్మానం చేయడానికి కూడా ముందుకు రాలేదు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఉద్యమకారుల సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించలేదు. బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రలోభాల పలుకులు పలికితే చెల్లదు. రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే లబ్ధి పొందని ఉద్యమకారులను తక్షణం స్పష్టంగా గుర్తించే ప్రక్రియను చేపట్టాలి. ఆ గుర్తింపు కూడా నిర్దిష్టంగా ఉండాలి. అంటే వారిని క్యాటగిరీలుగా విభజించాలి. అమరులు, జైళ్లకెళ్లినవారు, పోలీస్ కేసులు ఉన్నవారు, నిరాహారదీక్షలు చేసినవారు, ధర్నాలు, రాస్తారోకోలు చేసినవారు ఇలా అందరికీ ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా ఇవ్వాలి. కానీ ఇవేమీ చేయకుండా అఖిలపక్ష సమావేశాలు, అభిప్రాయ సేకరణలంటూ కల్ల్లబొల్లి కబుర్లు చెప్పి ఉద్యమకారులను మభ్యపెట్టాలని చూస్తే వాళ్ల్లు సూదుల్లాంటోళ్లు..ఏదో దిక్కు నుంచి పొడుసుకువస్తారని గమనించాలి. ‘తెరచాపతో నావ నడిపే నావికునికి గాలివాటం తెలిసినట్టు’ తెలంగాణ ప్రజల సమస్యలకు మూలాలు తెలిసిన నాయకుడు కేసీఆర్. అందుకే ఏదిచ్చినా, ఏ పథకం ప్రవేశపెట్టినా ఆ ఫలాలు అందరికీ అందేవిధంగా చూసేవారు.
-ఆర్ఆర్ఆర్