కేశంపేట, జనవరి 19 : ఆర్టీసీ బస్సులోంచి జారిపడిన మహిళకు గాయాలైన ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలో సోమవారం వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం.. మహేశ్వరం మండలం మురళీనగర్‌కు చెందిన సంధ్య తన పిల్లలతో కలిసి కేశంపేటకు చేరుకుంది. కేశంపేట నుంచి షాద్‌నగర్‌కు పయనమవుతున్న సమయంలో అంబేద్కర్ చౌరస్తావద్ద బస్సు ఎక్కిన సంధ్య తన పిల్లలు బస్సు ఎక్కలేదని గమనించి కంగారు పడింది.
అల్వాల చౌరస్తావద్దకు రాగానే కంగారులో జారి కిందపడినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధిత మహిళకు ప్రథమ చికిత్స చేయించి 108సహాయంతో షాద్‌నగర్ కమ్యూనిటీ దవాఖానకు తరలించారు.