రంగారెడ్డి/వికారాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో రెండో విడత పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, మొయినాబాద్, కడ్తాల్, తలకొండపల్లి, ఆమనగల్లు మండలాల్లో ఎన్నికలు జరిగాయి. 178 గ్రామపంచాయతీలకు 13 మంది ఏకగ్రీవం కాగా.. 165 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అలాగే, 1540 వార్డులకు 232 మంది ఏకగ్రీవం కాగా.. 1306 వార్డులకు ఎన్నికలు జరిగాయి.
ఉదయం 7 గంటల నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ జరగగా.. మధ్యాహ్నం తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి స్వగ్రామమైన చేవెళ్ల మండలం కౌకుంట్లలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్లు వేసేందుకు ఓటర్లు భారీగా బారులు తీరారు. పోలింగ్ కేంద్రాలను రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసుశాఖతో పాటు ఆయా శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

– వికారాబాద్ జిల్లాలో రెండో విడత పోలింగ్ ఒకట్రెండు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికలు జరిగిన ఏడు మండలాల్లో 82.72 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా పోలింగ్ ఒక్క శాతం తగ్గడం గమనార్హం. 2,09,847 ఓట్లకుగాను 1,73,594 ఓట్లు పోలయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా చలి ప్రభావంతో మొదటి రెండు గంటల్లో పోలింగ్ మందకొడిగా సాగగా.. ఆ తర్వాత పుంజుకున్నది. మోమిన్‌పేట్ మండలం కోలుకొంద గ్రామ పంచాయతీలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ స్వతంత్ర అభ్యర్థి ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రం వద్ద ధర్నా చేశారు.
పోలీసుల తీరును కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించడంతోపాటు ప్రత్యేకంగా మైక్రో అబ్జర్వర్లను నియమించారు. వికారాబాద్ రెవెన్యూ డివిజన్లోని వికారాబాద్, ధారూర్, బంట్వారం, కోట్‌పల్లి, మర్పల్లి, మోమిన్‌పేట్, నవాబుపేట్ మండలాల్లో 155 గ్రామ పంచాయతీలకు, 1520 వార్డులకు ఎన్నికలు జరిగాయి. కలెక్టర్ ప్రతీక్జైన్తోపాటు ఎస్పీ స్నేహ మెహ్రా పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళి, ఏర్పాట్లు, బందోబస్తును పరిశీలించారు.
