ఖమ్మం రూరల్, ఆగస్టు 10 : ప్రభుత్వం నూతనంగా అందించబోయే చేయూత పింఛన్లలో ఏ ఒక్క అర్హుడు మిగులొద్దని, అదే సమయంలో అనర్హులకు అవకాశం కల్పించవద్దని ఏదులాపురం మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ పి.అనిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఏదులాపురం మున్సిపాలిటీ కార్యాలయంలో చేయూత పింఛన్ల అర్హుల జాబితా ఎంపికపై మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్పర్సన్ మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు లోబడి అర్హులను గుర్తించాలన్నారు. పింఛన్ అనేది నిరుపేదలకు సామాజిక భద్రత అని ఈ భద్రత కల్పించే ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమాన్ని జాగ్రత్తగా ఎంపిక చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి వార్డు నుండి వచ్చిన దరఖాస్తును నిషితంగా పరిశీలించాలన్నారు. వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు, వార్డు కౌన్సిలర్లతో సమన్వయం చేసుకుంటూ సక్రమంగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ టి.నవీన్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

అనర్హులకు అవకాశం ఇవ్వొద్దు : ఈఎంసీ చైర్పర్సన్ పి.అనిత