రంగారెడ్డి జిల్లాలో లేఅవుట్లలో ఉన్న ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ఎల్ఆర్ఎస్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో లేఅవుట్లలో మిగిలిపోయిన ప్లాట్లు, ఖాళీ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించడానికి టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేస్తూ బృందాలను ఏర్పాటు చేసింది. కాని, ఈ బృందంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించే టౌన్ ప్లానింగ్ అధికారుల కొరత తీవ్రంగా ఉన్నది. జిల్లాలో 13 మున్సిపాలిటీలకుగాను ఐదుగురు మాత్రమే ఉండటంతో పనులు ముందుకు సాగడంలేదు. మరోవైపు ఇరిగేషన్ అధికారులు హైడ్రా ఆదేశాలతో చెరువులు, కుంటల ఆక్రమణలను గుర్తించే పనిలో పడ్డారు. దీంతో విధించిన మూడు నెలల గడువు పూర్తయినప్పటికీ వచ్చిన దరఖాస్తుల్లో ఐదు శాతం కూడా పూర్తికాకపోవడంపై దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.
– రంగారెడ్డి, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ)
జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు, 549 గ్రామపంచాయతీలకుగాను 2,83,680 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 13 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లలో 2,37,250 దరఖాస్తులు రాగా.. 549 గ్రామపంచాయతీల్లో 46,430 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను క్రమబద్ధీకరించేందుకు టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిపి మున్సిపాలిటీల కోసం 48 బృందాలు, గ్రామపంచాయతీల కోసం 18 బృందాలను నియమించారు. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి క్రమబద్ధీకరించాల్సి ఉంటుంది. ఈ విషయంలో రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, గ్రామపంచాయతీలకు సంబంధించిన అధికారుల లాగిన్‌లో ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంటుంది. చివరగా టౌన్ ప్లానింగ్ అధికారులు ప్లాట్లకు సంబంధించి విస్తీర్ణాన్ని బట్టి ఫీజును నిర్ధారిస్తారు. కాని, అధికారుల్లో సమన్వయం లేకపోవడంతో దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోలేకపోతున్నాయి.
వాపోతున్న దరఖాస్తుదారులు
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణ విషయంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపానికి తోడు క్షేత్రస్థాయిలో అధికారుల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. ఆరునెలలు దాటినప్పటికీ ఈ ప్రక్రియ ఇప్పటివరకు పూర్తికాకపోవడంతో దరఖాస్తుదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంటి నిర్మాణాల అనుమతులు, బ్యాంకు లోన్లకు వెళ్లాలనుకునేవారికి తీవ్ర నిరాశ కలిగిస్తున్నది. జిల్లాలోని అతి పెద్ద మున్సిపాలిటీల్లో కూడా ఇదే తంతు కొనసాగుతున్నది. నగర శివారుల్లోని తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట్, ఆదిబట్ల, తుక్కుగూడ వంటి మున్సిపాలిటీల్లో వేలకొద్దీ దరఖాస్తులు వచ్చినప్పటికీ వందల్లో కూడా పరిష్కారం కాలేదు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో 43వేల దరఖాస్తులు రాగా.. 2300., ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 18వేల దరఖాస్తులకు 1600 మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. దీంతో క్రమబద్ధీకరణ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. ముఖ్యంగా గతంలో గ్రామపంచాయతీ అనుమతులతో చేపట్టిన లేఅవుట్లలో అనేకమంది ప్లాట్లు కొనుగోలు చేసినప్పటికీ ఎల్ఆర్ఎస్ లేకపోవడంతో ఈ అవకాశం కలిసివస్తుందని భావించారు. కాని వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది.
రియల్ ఎస్టేట్ పతనానికి ఇది కూడా ఓ కారణం..
జిల్లాలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. ప్లాట్లు, భూముల విక్రయాలు జరుగక ఈ రంగాన్ని నమ్ముకున్న అనేకమంది రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో ఖాళీ ప్లాట్లను కొనుగోలు చేసి ఎల్ఆర్ఎస్లు కట్టి విక్రయించుకుందామనుకున్నప్పటికీ ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ముందుకు సాగకపోవటంతో మరింత కుదేలైంది. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ చకచకా సాగితే ప్లాట్ల క్రయవిక్రయాలు కూడా పెరిగే అవకాశాలున్నాయని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.
ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలి
ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలి. ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ఇప్పటికే పెద్దఎత్తున దరఖాస్తులు చేసుకున్నప్పటికీ అధికారులు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎవరూ ప్లాట్లు కొనుగోలు చేసేందుకు కూడా ముందుకు రావడంలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేసేందుకు కృషిచేయాలి.
– మైలారం విజయ్‌కుమార్