చేవెళ్ల రూరల్, నవంబర్ 6 : ఇంటింటి సర్వే ద్వారా రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు రద్దు చేస్తామని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఐటీ, పరిశ్రమలు, జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, అన్ని వ ర్గాలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు సర్వే చేస్తున్నామని స్పష్టం చేశారు. బుధవారం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని భవానీనగర్ (9వ వార్డు)లో ఉన్న పోచమ్మ గుడి వద్ద సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సర్వే ద్వారా సేకరించిన సమాచారంతో ప్రజలకు కులాల వారీగా, సామాజిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో తెలుసుకొని వాటిని అధిగమించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.
5,344 మంది ఎన్యూమరేటర్లు
రంగారెడ్డి జిల్లాలో 5,344 మంది ఎన్యూమరేటర్లను నియమించామని మంత్రి శ్రీధర్‌బా బు తెలిపారు. ఒకో ఎన్యూమరేటర్‌కు 150 ఇండ్లను కేటాయించామన్నారు. ఈ నెల 30 వరకు కొనసాగనున్న సర్వేలో మొదటి మూ డు రోజులు ప్రతి ఇంటికి స్టిక్కర్లు అతికిస్తారని వెల్లడించారు. ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటిలో 40 నిమిషాల పాటు కూర్చొని ప్రభుత్వం సూచించిన 75 అంశాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించాలని, ప్రజలు కూడా సహకరించాలని సూచించారు. ఏమైనా తప్పులు ఉంటే తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్‌కు సమాచారం ఇచ్చి తప్పులు దొర్లకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మధుసూదన్ రెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పామెన భీమ్ భరత్, మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మీప్రవీణ్‌కుమార్, సీపీవో సౌమ్య, డీపీవో సురేశ్ మోహన్, ఎంపీడీవో వెంకయ్య గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.