గ్రీన్ ఫీల్డ్ రోడ్డు.. జిల్లా రైతుల్లో తీవ్ర కలకలం రేపుతున్నది. 41 కిలోమీటర్ల రోడ్డు కోసం 1,003 ఎకరాలను ప్రభుత్వం లాక్కొంటున్నది. ఫోర్త్‌సిటీ కోసం 330 అడుగుల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు వేయడమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. దౌర్జన్యంగా భూములను తీసుకోవాలని చూస్తుండడంతో రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. కందుకూరు మండలంలోని పంజాగూడ సమీపంలో ఏర్పాటవుతున్న ఫోర్త్‌సిటీ కోసం ప్రభుత్వం రెండు వైపుల నుంచి 330 అడుగుల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును ప్రతిపాదించింది. కొంగరకలాన్ సమీపంలోని కలెక్టరేట్ వద్ద ఉన్న ఓఆర్ఆర్ నుంచి పంజాగూడ వరకు 20 కిలోమీటర్ల మేర రోడ్డు ఏర్పాటుకు 449 ఎకరాలు, పంజాగూడ నుంచి ఆకుతోటపల్లి వరకు 21 కిలోమీటర్ల రోడ్డుకు 554 ఎకరాలను రైతుల నుంచి ప్రభుత్వం తీసుకుంటున్నది.
– రంగారెడ్డి, జనవరి 8 (నమస్తే తెలంగాణ)
ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న రైతులు.. పోలీస్ బందోబస్తు మధ్య సర్వే..
గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణం కోసం చేస్తున్న సర్వే నిర్బంధాల మధ్య సాగుతున్నది. మొదటిరోజు కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లిలో నిర్వహించిన సర్వేను రైతులు అడ్డుకోవడంతో అధికారులు వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. దీంతో పోలీస్ బందోబస్తు మధ్య ఓఆర్ఆర్ నుంచి పంజాగూడ వరకు రోడ్డు సర్వే పూర్తి చేశారు. గత రెండు రోజుల నుంచి కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లో రెండో విడుత సర్వే ప్రారంభం కావడంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. బుధవారం ఆమనగల్లు మండలంలోని కాకిబండతండాలో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను మూకుమ్మడిగా గ్రామస్తులు అడ్డుకుని నిరసన తెలిపారు. తమ ప్రాణాలు పోయినా భూములిచ్చేది లేదని పంటపొలాల్లో అడ్డుగా కూర్చున్నారు. పోలీసులు, రైతులను ఒప్పించడానికి ప్రయత్నించినప్పటికీ.. వారు ససేమిరా అనడంతో అధికారులు వెనుదిరుగక తప్పలేదు. కడ్తాల్ మండలంలోని ఎక్వాయిపల్లి పరిసరాల్లో మాత్రం చాటుమాటుగా సర్వేను నిర్వహించారు.