Road Accident | యాచారం, మే 23 : హైదరాబాద్ – నాగార్జున సాగర్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు – బైక్ ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాద ఘటన యాచారం పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకున్నది.
సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా చందంపేట మండలం గాగిల్లపురం గ్రామానికి చెందిన కృష్ణ (32) అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ నుంచి తన స్వగ్రామానికి వెళ్తున్నాడు. సరిగ్గా మండలంలోని చింతపట్ల గేటు వద్దకు రాగానే మాల్ నుంచి ఎదురుగా వస్తున్న ఓ కారు బైకును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కృష్ణ తలకు తీవ్ర గాయాలు కావడంతో అతను అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.