మన్సూరాబాద్, మార్చి 23: ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధి శివగంగ కాలనీలో పాత నేరస్తుడైన ఓ వ్యక్తి అర్ధరాత్రి దారుణహత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్యకు పాల్పడిన నలుగురు నిందితులు పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం. పోలీసులు, మృ తుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్, భరత్‌నగర్‌కు చెందిన బొడ్డు మహే శ్(31) ప్రస్తుతం ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నాడు.
మహేశ్‌కు భార్య, కూతురు ఉన్న ట్లు సమాచారం. బొడ్డు మహేశ్‌కు పురుషోత్తం, సందీప్, రాము, నాగార్జునతోపాటు మరికొందరితో స్నేహం ఉన్నది. స్నేహితులైనప్పటికీ మహేశ్, పురుషోత్తం వేర్వేరుగా గ్యాంగ్‌లు నడుపుతున్నారు. కొన్నేళ్లుగా ఇద్ధరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. రెండేండ్ల క్రితం తట్టి అన్నారంలోని ఓ బార్లో మద్యం సేవించిన మహేశ్, పురుషోత్తం గొడవపడ్డారు. పురుషోత్తం బీరు బాటిల్‌తో మహేశ్ తలపై కొట్టడం తో గాయాలయ్యాయి. ఈ విషయమై హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నాటి నుంచి బొడ్డు మహేశ్, పురుషోత్తం మధ్య కక్షలు పెరిగాయి. తనపై దాడికి పాల్పడిన పురుషోత్తంపై మహేశ్ కక్ష పెంచుకున్నాడు.
ఈ క్రమంలో మూడు నెలల క్రితం చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ క్లినిక్ వద్ద ఉన్న పురుషోత్తంతో పాటు మరో వ్యక్తిపై బొడ్డు మహేశ్ దాడికి పాల్పడ్డాడు. పురుషోత్తం అతడి మిత్రుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. దాడికి పాల్పడిన బొడ్డు మహేశ్‌ను చైతన్యపురి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. 20 రోజుల కిందట బొడ్డు మహేశ్ జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే మహేశ్ బతికి ఉంటే తనకు ప్రాణహాని ఉంటుందని భావించిన పురుషోత్తం అతడి మిత్రులు.. ఎలాగైనా మహేశ్‌ను అంతమొందించాలని పథకం వేసుకున్నారు. అందులోభాగంగా మూ డు రోజుల నుంచి మహేశ్‌ను వెంబడిస్తూ అదను కోసం చూస్తున్నారు.
శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో బొడ్డు మహేశ్ తన స్నేహితుడితో కలిసి హోండా యాక్టివాపై ఆర్టీసీ కాలనీ నుంచి శివగంగ కాలనీ వైపునకు వెళ్తున్నాడు. అప్పటికే ఆ ప్రాంతంలో మాటువేసి ఉన్న పురుషోత్తం గ్యాంగ్ మహేశ్ శివగంగ కాలనీ వద్దకు రాగానే వెనుక నుంచి కారుతో బైక్‌ను ఢీకొట్టారు. బైక్ పైనుంచి మహేశ్ కింద పడిపోగానే కారులో ఉన్న పురుషోత్తం, నాగార్జున, రాము, సందీప్ ఒక్క ఉదటున కిందికి దిగారు.
పరుగెత్తుతున్న మహేశ్‌ను వెంబడించి గొడ్డలి, కత్తులు, కొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న మహేశ్‌ను ఎల్బీనగర్లోని కామినేని దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మహేశ్‌ను హతమార్చిన అనంతరం నిందితులు పురుషోత్తం, సందీప్, నాగార్జున, రాము పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.
హత్యలో మరికొందరు పాల్గొన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. నిందితులు నలుగురిని ఓ రహస్య ప్రదేశంలో ఉంచి పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. బొడ్డు మహేశ్‌ను దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి సోద రి మౌనిక ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీస్‌స్టేషన్ ఆవరణలో మృతుడి సోదరి మౌనిక, అతడి తల్లి విలేకరులతో మాట్లాడుతూ మహేశ్ హత్య వెనుక పురుషోత్తం బావ తో పాటు ఆర్కేపురం డివిజన్ అల్కాపురి ప్రాం తానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందని వారు ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.