మండలంలోని మాల్ మార్కెట్లో ప్రతి మంగళవారం పెద్దఎత్తున సంత జరుగుతుంది. నాగార్జునసాగర్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై.. రంగారెడ్డి, నల్గొండ జిల్లాల సరిహద్దులో ఉండటంతో అది అంచెలంచెలుగా వాణిజ్య కేంద్రంగా ఎదిగింది. ప్రతి వారం లక్షల్లో వ్యాపారం కొనసాగుతున్నది. అయినప్పటికీ సంత నిర్వహించేందుకు అక్కడ సొంత స్థలం లేకపోవడం గమనార్హం. నేటికీ పశువుల సంతను ఓ ప్రైవేటు వెంచర్ స్థలంలో నిర్వహిస్తున్నారు. అది ప్రైవేటు స్థలం కావడం, అక్కడ కనీస వసతులు సైతం లేకపోవడంతో పశువుల క్రయ, విక్రయదారులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేలం ద్వారా పంచాయతికీ లక్షల్లో ఆదాయం పస్తున్నప్పటికీ కనీస వసతులు కల్పించకపోవడం పట్ల వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంగడిలో నెలకొన్న సమస్యలపై అటు పాలకులు.. ఇటు పంచాయతీరాజ్ అధికారులు చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారు.
యాచారం, సెప్టెంబర్ 29 : మాల్ పశువుల సంతకు ప్రసిద్ధి. ప్రతి మంగళవారం రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన వివిధ మండలాల వ్యాపారులు, రైతులు అంగట్లో పశువుల క్రయవిక్రయాలు కొనసాగిస్తారు. కాడెద్దులు, గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, పొట్టేళ్ల విక్రయాలు జోరుగా కొనసాగుతాయి. అంగడికి సొంత స్థలం లేకపోవడంతో పశువుల సంతను ప్రైవేటు వెంచర్లో, చిరువ్యాపారులు నాగార్జునసాగర్ రోడ్డుకు ఇరువైపులా వివిధ రకాల వస్తువులను అమ్ముకొని జీవనోపాధి పొందుతున్నారు. దీంతో రోడ్డు రద్దీగా మారుతున్నది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. అప్పుడప్పుడు రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాల్లో అంగడికి ప్రత్యేక స్థలం కేటాయించి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
తప్పని తాగునీటి వెతలు
ఉదయం నుంచి సాయంత్రం వరకు పశువులు, వ్యాపారులతో సంత నిర్వహించే స్థలం కిటకిటలాడుతుంది. మూగజీవాలకు సరిపడా తాగునీరు లేక అవి అల్లాడుతుంటాయి. ఒకటి, రెండు తొట్లు నిర్మించినప్పటికీ అందులో సరిపడా నీరుండటంలేదు. మూగజీవాలతోపాటు వ్యాపారులు, వినియోగదారులకు సైతం నిర్వాహకులు తాగునీరు సౌకర్యం కల్పించకపోవడం గమనార్హం. దీంతో వాటర్ బాటిళ్లను కొనుగోలు చేసి నీరు తాగాల్సిన దుస్థితి నెలకొన్నది. వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయాలని, తొట్లలో పుష్కలంగా నీటిని అందుబాటులో ఉంచాలని వ్యాపారులు, రైతులు కోరుతున్నారు.
మౌలిక వసతులు కరువు
సంతలో ఎలాంటి షెడ్లను ఏర్పాటు చేయకపోవడంతో మం డుటెండలో మూగజీవాలు విలవిల్లాడుతుంటాయి. వ్యాపారులు, రైతులు పశువులను అమ్మాలన్నా, కొనాలన్నా ఎండలో నిలబడి ఇబ్బందులెదుర్కొంటున్నారు. వానకాలంలో వర్షంలో తడుస్తూ వ్యాపారం కొనసాగిస్తుంటారు. అక్కడక్కడ టెంట్లు వేసినప్పటికీ అధిక సంఖ్యలో ప్రజలు రావడంతో నిలువనీడ కరువవుతున్నది. కనీసం మూత్రశాలలు, మరుగుదొడ్లు కూడా లేవు. సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
శాశ్వత స్థలం కేటాయించాలి
పశువుల సంతకు శాశ్వత స్థలాన్ని కేటాయించాలి. వేల సంఖ్యలో పశువుల క్రయ, విక్రయాలు జరగడం.. వందల సంఖ్యలో వ్యాపారులు రావడంతో ప్రైవేటు స్థలంలో ఇబ్బందులు తప్పడంలేదు. మాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని సంతకు కేటాయించి సమస్యను పరిష్కరించాలి. సంతలో వ్యాపారులు, మూగజీవాలకు మౌలిక వసతులను కల్పించాలి. సంతను మరింత అభివృద్ధి దిశగా నడిపించాలి. దీని కోసం అధికారులు ప్రత్యేక చొరవ చూపి చిరువ్యాపారులకు స్థలాన్ని కేటాయించాలి.
– కలకొండ అంజయ్య, వ్యాపారి, మేడిపల్లి
అధికారులు స్పందించాలి
సంతకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు సంబంధిత రెవెన్యూ, పంచాయతీ అధికారులు కృషి చేయాలి. సంతలో కనీస వసతులు కల్పించకపోతే నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు స్థలంలో సంతను నిర్వహించడం వలన వ్యాపారులు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండాకాలం, వర్షాకాలంలో అవస్థలు పడుతున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. సంతలో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలి.
– డేరంగుల రాజు, నల్లవెల్లి మాజీ సర్పంచ్