వికారాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నదన్న చందంగా తయారైంది జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితి. చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు పేరుకే ప్రాజెక్టులుగా మారాయి. ఆయా ప్రాజెక్టుల్లో నిండా నీరున్నా ఒక్క ఎకరాకు కూడా సాగు నీరందించే పరిస్థితి లేకపోవడం గమనార్హం. జిల్లాలో ఎనిమిది చిన్న, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ సంబంధిత ప్రాజెక్టుల నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారాయి.
వర్షాలు సమృద్ధిగా పడి చెరువులు, ప్రాజెక్టులు నిండినప్పటికీ ఆయా ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరందించలేని పరిస్థితి దాపురించింది. ఏటా జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు ఆయా ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీరందుతుందని కాకి లెక్కలు చూపిస్తున్నా.. వాస్తవానికి మాత్రం ఒక్క ఎకరాకు కూడా సాగునీరందడం లేదు. ప్రాజెక్టులకు సంబంధించి తూములు, కాల్వలు పూర్తిగా దెబ్బతినడంతో ప్రాజెక్టుల్లో సమృద్ధిగా నీరున్నా రైతులు తమ పొలాల సాగుకు వాడుకోలేని దుస్థితి నెలకొన్నది.
జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టు అయిన కోట్‌పల్లిలో ఏటా నీటి నిల్వలు సరిపోను ఉన్నప్పటికీ మరమ్మతులు చేయకపోవడంతో నీరు వృథా అవుతున్నది. 50 ఏండ్ల కింద నిర్మించిన కోట్‌పల్లి ప్రాజెక్టు కాల్వలు పూర్తిగా దెబ్బతినడం, తూములు కొట్టుకుపోవడం, బ్రిడ్జిలు కూలిపోవడంతో కోట్‌పల్లి ప్రాజెక్టులో నీరున్నా ఆయకట్టుకు సాగునీరందించని పరిస్థితి నెలకొన్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి బడ్జెట్లో కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణకు నిధులివ్వడంతో అంచనాలు పూర్తి చేసి ప్రభుత్వానికి అధికారులు అందజేసిన అనంతరం మంజూరు దశలో ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. తదనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణ ఊసే లేదు. ఇప్పటికే అంచనాలు పూర్తి చేసి సంబంధిత శాఖ ఈఎన్సీ వద్ద ఉన్న కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణ ఫైల్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కదలిక తీసుకురాకపోవడంలో వైఫల్యంపై విమర్శలు వెలువడుతున్నాయి.
ప్రాజెక్టుల కింద 21,554 ఎకరాల ఆయకట్టు..
జిల్లాలోని కోట్‌పల్లి, లక్నాపూర్, జుంటుపల్లి, సర్పన్‌పల్లి, నందివాగు, శివసాగర్, అల్లాపూర్, కొంశెట్టిపల్లి ప్రాజెక్టులు ఉన్నాయి. సంబంధిత ప్రాజెక్టుల ద్వారా 21,554 ఎకరాలకు ఆయకట్టు ఉన్నదని జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. కోట్‌పల్లి ప్రాజెక్టు ద్వారా 9200 ఎకరాలు, సర్పన్‌పల్లి ప్రాజెక్టు ద్వారా 3285 ఎకరాలు, నందివాగు ప్రాజెక్టు కింద 1900 ఎకరాలు, జుంటుపల్లి ప్రాజెక్టు కింద 2082 ఎకరాలు, శివసాగర్ ప్రాజెక్టు కింద 1000 ఎకరాలు, అల్లాపూర్ ప్రాజెక్టు కింద 1414 ఎకరాలు, కొంశెట్టిపల్లి ప్రాజెక్టు ద్వారా 1073 ఎకరాలు, లఖ్నాపూర్ ప్రాజెక్టు కింద 2469 ఎకరాల ఆయకట్టు ఉన్నదని ఇరిగేషన్ అధికారులు లెక్కలు చెపుతున్నా..
ఒక్క ఎకరాకు కూడా సాగునీరందించలేని దుస్థితి నెలకొన్నది. జిల్లాలోని ప్రాజెక్టులు, ప్రధాన చెరువుల నుంచి వెళ్లే కాల్వలు పూర్తిగా పాడై సాగు నీరందించే పరిస్థితి లేదు. అధికారులు సంబంధిత ఆయకట్టుకు సాగునీరదించే దిశగా ఆలోచించకపోవడం శోచనీయం. ఏటా ప్రాజెక్టుల ఆయకట్టు పేపర్‌కే పరిమితమవుతున్నది. ప్రాజెక్టుల నిర్వహణను కూడా అధికారులు గాలికి వదిలేయడంతో సంబంధిత ప్రాజెక్టుల కాల్వలు, తూములు పూర్తిగా దెబ్బతిన్నాయి.
సర్పన్‌పల్లి, శివసాగర్, లక్నాపూర్ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగు నీరందించడం ఏమోకాని సంబంధిత ప్రాజెక్టుల ఎఫ్టీఎల్, బపర్జోన్లు ఆక్రమణలకు గురైనా జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సర్పన్‌పల్లి ప్రాజెక్టుకు ఆనుకొని వెలిసిన రిసార్ట్‌ల నిర్వాహకులు చెరువులో బోటింగ్ దందా చేస్తూ ఒక్క చుక్క నీటిని కూడా వదలనివ్వ కుండా అక్రమ వ్యాపారం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
7 గ్రామాలకే అందుతున్న సాగునీరు..
జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టు అయిన కోట్‌పల్లి ప్రాజెక్టుకు గత రెండు, మూడేండ్లుగా భారీగా వరద వస్తుండడంతోపాటు సంబంధిత ప్రాజెక్టు కింద ఉండే కాల్వలన్నీ కొట్టుకుపోవడంతో తక్కువ విస్తీర్ణంలో సాగు నీరందిస్తున్నారు. కోట్‌పల్లి ప్రాజెక్టు ద్వారా తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లోని 18 గ్రామాలకు సాగునీరు అందించాల్సి ఉండగా, కాల్వలు పూర్తిగా దెబ్బతినడం, తూములు కొట్టుకుపోవడంతో కేవలం 7 గ్రామాలకు మాత్రమే సాగునీరందిస్తున్నారు.
గతేడాది తూములు, కాల్వలు వరదకు కొట్టుకుపోవడంతో ఒక్క ఎకరాకు కూడా సాగునీరందించలేకపోయారు. ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా రుద్రారం, గట్టేపల్లి గ్రామాలకు, కుడి కాల్వ ద్వారా నాగసముందర్, మాన్సాన్పల్లి, జనగాం, మంబాపూర్, మారెపల్లితండా గ్రామాల పరిధిలోనే సాగు నీరందిస్తున్నారు. 1.57 టీఎంసీల సామర్థ్యం గల కోట్‌పల్లి ప్రాజెక్టులో పుష్కలంగా నీరున్నా కాల్వలు పూర్తిగా కొట్టుకుపోవడం, దెబ్బతినడంతో రైతులకు నష్టం జరుగకూడదనే లక్ష్యంతో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంతో గత ప్రభుత్వం వెంటనే జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వి.ప్రకాష్‌తోపాటు అధికారుల బృందాన్ని పంపి ఏయే పనులు చేపట్టాలనే సమగ్ర నివేదికను అందజేయాలని సూచించడంతోపాటు తదనంతరం కోట్‌పల్లి ప్రాజెక్టు మరమ్మతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ కూడా ఇచ్చింది.
రూ.110 కోట్ల నిధులతో కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణతోపాటు ఆనకట్ట బలోపేతం, కుడి, ఎడమ, బేబి కాల్వల పునర్నిర్మాణం, కాల్వల పునర్నిర్మాణం, పాత బ్రిడ్జిల స్థానంలో కొత్త బ్రిడ్జిలను నిర్మించడం తదితర మరమ్మతులు చేపట్టేందుకు అంచనాలను తయారు చేశారు. తదనంతరం ఎన్నికలు రావడంతో పెండింగ్‌లోనే ఉండిపోయింది. అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జిల్లాలో ఉన్న ఒకే ఒక్క మధ్యతరహా ప్రాజెక్టుకు కూడా నిధులివ్వడంపై దృష్టి సారించడం లేదు. కోట్‌పల్లి ప్రాజెక్టు ద్వారా 9200 ఎకరాలకు(కుడి కాల్వ ద్వారా 8100 ఎకరాలు, ఎడమ, బేడి కాల్వ ద్వారా 1100 ఎకరాలకు) సాగు నీరందించే సామర్థ్యం ఉన్న కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు పూర్తైతే 15 వేల ఎకరాలకుపైగా సాగు నీరందించే అవకాశాలు ఉన్నట్లు జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.