రంగారెడ్డి, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక లో నియమావళిని ఉల్లంఘించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయడంతోపాటు.. అధికార పార్టీకి తొత్తుగా మారిన ఆర్డీవో, ఏసీపీని వెంటనే విధుల నుంచి తప్పించాలని గురువారం కలెక్టర్ నారాయణరెడ్డికి బీఆర్ఎస్ నాయకుల బృందం ఫి ర్యాదు చేసింది. గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ కృపేశ్, నాయకులు సురేశ్, శివసాయి, జగదీశ్వర్ తదితరులు కలెక్టర్‌ను కలిసి మాట్లాడుతూ.. ము న్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే దానిని అతిక్రమించారని.. అలాగే ఎన్నికలకు ముందు కూడా నియమావళిని ఉల్లంఘించగా బీఆర్ఎస్ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు.
స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినా ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన ఆర్డీవో, ఇబ్రహీంపట్నం ఏసీపీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే చెప్పినట్లు విని ఆ ఇరువురు అధికారులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే స్థానిక ఎమ్మెల్యే గత నెల 4న ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రి నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించటంతోపాటు.. వందల కోట్లు వెచ్చించి ఇబ్రహీంపట్నంలో అభివృద్ధి పనులను చేపడుతున్నామని ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని వివరించారు. అలాగే, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి రూ. 765 కోట్లు మంజూరు చేశామని ప్రకటించడంతోపాటు.. గతనెల 10న అంబేద్కర్ చౌరస్తా లో కార్యకర్తలతో రోడ్లపై తిరుగుతూ.. కాం గ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం చేసినా ఎమ్మెల్యేపై ఆర్డీవో ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
గత నెల 16న ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తున్న సమయంలో మున్సిపల్ కార్యాలయంపై రాళ్లదాడి జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పైగా ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు వస్తున్నాయని ఉదేశ్యపూర్వకంగానే ఆ ఎన్నికను ఆర్డీవో వాయిదా వేశారని ఆరోపించా రు. అలాగే, 17న చైర్మన్ ఎన్నిక జరుగగా.. బీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి మద్దతుగా 13 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఒక బీజే పీ, మరో స్వతంత్ర అభ్యర్థి మద్దతు తెలిపారని.. సంఖ్యాబలం ఉన్నా.. చైర్మన్‌గా సుదర్శన్‌రెడ్డిని ప్రకటించకుండా కోర్టు స్టే వచ్చేవరకూ కాలయాపన చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే చెప్పినట్టు వింటూ ఆర్డీవో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని.. అలాగే, ఇబ్రహీంపట్నం ఏసీపీ కూడా ఎన్నికల కోడ్ ను తుంగలో తొక్కారని ఆరోపించారు. స్పందించిన కలెక్టర్ నివేదిక తెప్పించుకుని వారిపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బీఆర్ఎస్ నాయకు లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జంగయ్య, శ్రీనివాస్, సుధాకర్‌గౌడ్, రవీందర్, నర్సింహ, ప్రవీణ్, సతీశ్, మహేందర్, పవన్, సురేశ్ పాల్గొన్నారు.