రంగారెడ్డి, జనవరి 26 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం తో జిల్లాను ప్రగతిపథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ శశాంక అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన 75వ భారత గణతంత్ర వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన ప్రగతిపై ప్రసంగించారు.
దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరిస్తూ.. వారి ఆశయ సాధనకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగడంతోపాటు పే దల ఆకాంక్షను నెరవేరుస్తున్నదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ సేవలను అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. అభయహస్తం కింద జిల్లా ప్రజల నుంచి 20,99,208 మంది నుంచి దరఖాస్తులను స్వీకరించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా కంప్యూటరీకరించినట్లు తెలిపారు. రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకు 2,20,330 మంది రైతుల ఖాతాల్లో రూ.105కోట్ల 35 లక్షల ను జమ చేసినట్లు తెలిపారు.
గణతంత్ర వేడుకల సందర్భంగా జిల్లా పరిషత్ గర్ల్స్ హైసూల్ (ఇబ్రహీంపట్నం), తెలంగాణ మాడల్ స్కూల్ (శంకర్పల్లి), శ్రీ గాయత్రి సూల్ (బడంగ్‌పేట), కేజీవీపీ ఆమనగల్లు, గవర్నమెంట్ చిల్డ్రన్ హోమ్ స్టూడెంట్స్ (మొయినాబాద్) చిన్నారులు దేశభక్తిని చాటేలా ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. గణతంత్ర వేడుకల్లో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, భూపాల్‌రెడ్డి, డీఆర్వో సంగీత, మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, బడంగ్‌పేట మున్సిపాలిటీ మేయర్ చిగురింత పారిజాత తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్, జనవరి 26,(నమస్తే తెలంగాణ): జిల్లాలో 75వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ సి.నారాయణరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. వికారాబాద్ ప్రభుత్వ బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొత్తగడి రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 241 మంది ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.
అదేవిధంగా బ్యాంకు లింకేజీ ద్వారా 539 స్వయం సహాయక సంఘాలకు రూ.28.74 కోట్ల చెక్కు, స్త్రీనిధి ద్వారా 331 స్వయం సహాయక సంఘాలకు రూ.6.20 కోట్ల చెక్కులను అందజేశారు. కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్, ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ సీఈవో జానకీరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాలు అమల్లోకి వచ్చాయన్నారు.
మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు 25,08,608 ఉచిత బస్సు టికెట్ల ద్వారా మహిళలు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారన్నారు. మరోవైపు రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచిందన్నారు.
ప్రజాపాలన అభయహస్తం గ్యారెంటీల కోసం జిల్లావ్యాప్తంగా 57 బృందాలతో 2,84,275 దరఖాస్తులను స్వీకరించడంతోపాటు ఆన్లైన్ చేశామన్నారు. రైతు భరోసా పథకంలో భాగంగా ఇప్పటివరకు 1,68,085 మంది రైతులకు రూ.95.48 కోట్లను అందజేశామన్నారు. కార్యక్రమంలో ఎస్పీ కోటిరెడ్డి, అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యానాయక్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ అమిత్నారాయణ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్‌కుమార్, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల తదితరులు పాల్గొన్నారు.