వికారాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో జిల్లాలో బాలికలే పైచేయి సాధించారు. గతేడాది మాదిరిగానే ఈ ఏటా కూడా వారిదే హవా కొనసాగింది. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో జిల్లాలో 63.13% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. రాష్ట్రస్థాయిలో జిల్లా 28వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏటా ఉత్తీర్ణతాశాతం పెరగ డం గమనార్హం. గతేడాది 61% మేర విద్యార్థు లు ఉత్తీర్ణులయ్యారు.
కాగా ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 59.52%, ద్వితీయ ఏడాదిలో 67.29% ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ ఏడాది ఉత్తీర్ణతాశాతం గతేడాదితో పోలిస్తే తగ్గింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రత్యేక శ్రద్ధ చూపి నా అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయారు. మరోవైపు మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. సప్లిమెంటరీ పరీక్షా ఫీజు చెల్లింపునకు ఈనెల 30 వరకు గడువు విధించినట్లు ఇంటర్‌బోర్డు అధికారులు వెల్లడించారు.
ఉత్తీర్ణులైన విద్యార్థులు..9,482 మంది
జిల్లాలో ఇంటర్మీడియట్ జనరల్, వొకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో మొత్తం 14,703 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 9,482 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ద్వితీయ సంవత్సరంలో 5,589 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 67.29% ఉత్తీర్ణతతో 3,761 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. అందు లో బాలురు 2,478 మందిలో 1,480(59.73 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికల్లో 3,111 మంది పరీక్షలు రాయగా 2281 (73.32%) మంది పాస్ అయ్యారు.
అదేవిధంగా ఇంటర్ మొదటి ఏడాది పరీక్షా ఫలితాలకు సంబంధించి రాష్ట్రస్థాయిలో జిల్లా 16వ స్థానంలో నిలవగా 59.52% మేర విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొదటి ఏడాది పరీక్షలకు 6,418 మంది విద్యార్థులు హాజరుకాగా 3,820మంది ఉత్తీర్ణత సాధించారు. వారిలో 66.94% ఉత్తీర్ణతతో బాలికలు ముందంజలో ఉండగా, 50.76%తో బాలురు ఉన్నారు. మొదటి ఏడాదిలో 3,475 మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా 2,326 మంది పాస్ అయ్యారు. అదేవిధంగా 2,943 మంది బాలురు పరీక్షలు రాయగా 1494 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఇంటర్ వొకేషనల్ మొదటి ఏడాదిలో 1,496 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయగా 1,032(68.98%) మంది ఉత్తీర్ణులయ్యారు. వారిలో బాలురు 548 మందిలో 278 (50.73%) మంది ఉత్తీర్ణులు కాగా.. బాలికల్లో 948 మంది పరీక్షలకు హాజరుకాగా 754(79.54%) మంది ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా వొకేషనల్ రెండో ఏడాది ఫలితాల్లో 1,200 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 869 (72.42%) మంది ఉత్తీర్ణులయ్యారు. వారిలో 438 బాలురు పరీక్షలకు హాజరుకాగా 48.86%తో 214 మంది బాలురు, 762 బాలికల్లో 85.96%తో 655 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు.
రంగారెడ్డి జిల్లాలో 77.72% ఉత్తీర్ణత
రంగారెడ్డి, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 77.72% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. మొదటి సంవత్సరంలో 76.95% మంది పాస్‌అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ద్వితీయ స్థానంలో ఉం డగా.. రెండో సంవత్సరంలో నాలుగోస్థానంలో నిలిచింది. మొదటి ఏడాదిలో 76,962 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 59, 227 మంది ఉత్తీర్ణత సాధించారు. రెండో ఏడాదిలో 66,586 మంది పరీక్షలు రాయగా 52,526 మంది పాస్ అయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో ఉత్తీర్ణతాశాతం తగ్గింది. గతేడాది రాష్ట్రస్థాయిలో జిల్లా రెండోస్థానంలో ఉండగా ఈ ఏడాది నాల్గో స్థానానికి పడిపోయింది.