రంగారెడ్డి, మే 14 (నమస్తే తెలంగాణ) : చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పోటెత్తగా.. పట్టణాల్లోని ఓటర్లు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. 2019 ఎన్నికల్లో 53.25 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ ఎన్నికల్లో 56.40 శాతం నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే 3 శాతానికి పైగా ఓటింగ్ పెరిగింది. అత్యధికంగా చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్లో 71.83 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా శేరిలింగంపల్లి సెగ్మెంట్లో 43.91 శాతం నమోదైంది.
కాస్తంత పెరిగిన పోలింగ్ సరళితో ఎవరికి నష్టం! ఎవరికి మేలు! అన్నదానిపై రాజకీయ పార్టీల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. మరోపక్క అధికార యంత్రాంగం జూన్ 4న జరిగే కౌంటింగ్‌పై దృష్టి పెట్టింది. చేవెళ్లలో కౌంటింగ్ నిర్వహించనున్న బండారి శ్రీనివాస్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్‌లకు ఈవీఎంలను పటిష్ట భద్రత నడుమ తరలించారు. 144 సెక్షన్ నిషేదాజ్ఞలను ఎన్నికల అధికారులు అమలు చేస్తున్నారు.
కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఓట్ల లెకింపు కేంద్రమైన చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు చేర్చారు. ఆయా సెగ్మెంట్ల నుంచి తరలించిన ఈవీఎంలను జాగ్రత్తగా సరి చూసుకుని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని స్ట్రాంగ్ రూంలలో నియోజకవర్గాల వారీగా క్రమపద్ధతిలో ఉంచారు.

ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేందర్‌కుమార్ కటారియాతోపాటు, అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూములకు సీల్ వేశారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక, వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, వికారాబాద్ అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ సేహ్నలు ఈవీఎంల భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సాయుధ బలగాలతో పహారా ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూంలతోపాటు వాటి పరిసరాలను అనుక్షణం పరిశీలించేందుకు వీలుగా సీసీ కెమెరాలను అమర్చి, మానిటర్ల ద్వారా పర్యవేక్షణ జరిపిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ నిషేదాజ్ఞలు అమలులోకి తెస్తూ ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ఓట్ల లెకింపు కేంద్రంలోకి ఇతరులెవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జూన్ 4న చేపట్టనున్న ఓట్ల లెకింపు ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ శశాంక ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
స్ట్రాంగ్ రూముల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ నిర్వహించాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెకింపు విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది రాకపోకలకు, అభ్యర్థులు, ఏజెంట్ల రాకపోకల కోసం వేర్వేరు మార్గాలతో బారికేడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. తాగునీరు, విద్యుత్తు సరఫరా, కౌంటింగ్ టేబుల్స్, ఇతర అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట వికారాబాద్ అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి, సహాయ రిటర్నింగ్ అధికారులు, సంబంధిత అధికారులు ఉన్నారు.
