రంగారెడ్డిజల్లాలో మరో 11 సహకార సంఘాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు కొత్తగా సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని దరఖాస్తులు రాగా, వాటిని పరిశీలించిన అధికారులు కొత్తగా సహకార సంఘాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం జిల్లాలో 35 సహకార సంఘాలున్నాయి. కొత్తగా 11 సహకార సంఘాలు ఏర్పాటైతే వీటి సంఖ్య 46కు చేరనున్నది. జిల్లాల పునర్విజనతో రంగారెడ్డిజిల్లాలోకి షాద్‌నగర్ నియోజకవర్గంతోపాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడ్గుల, తలకొండపల్లి, ఆమనగల్లు మండలాలు చేరాయి.
వీటి చేరికతో ప్రస్తుతం జిల్లాలో సహకార సంఘాల సంఖ్య 35గా ఉన్నది. గతంలో నిర్వహణ భారంగా మారిన పలు సహకార సంఘాలను రద్దు చేసింది. ప్రస్తుతమున్న సహకార సంఘాల పరిధి పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క సహకార సంఘం మాత్రమే ఉన్నది. జిల్లాలోని అతిపెద్ద మండలాలైన అబ్దుల్లాపూర్‌మెట్, యాచారం, మంచాల మండలాలకూ ఒకే ఒక్క సహకార సంఘం చొప్పున ఉన్నాయి. సహకార సంఘాల పరిధి పెరిగినందున రైతులకు సహకార సంఘాలు సరైన సహకారాన్ని అందించడంలేదనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
– రంగారెడ్డి, జనవరి 19 (నమస్తే తెలంగాణ)
జిల్లాలోని 21 మండలాలు, 13 మున్సిపాలిటీలు, 2 మున్సిపల్ కార్పొరేషన్లతో కలిపి మొత్తం 35 సహకార సంఘాలున్నాయి. వీటిలో ప్రస్తుతం ఇబ్రహీంపట్నం మండలంలో మంగల్‌పల్లి పటేల్‌గూడ, ఉప్పరిగూడ, దండుమైలారం, పోల్కంపల్లి సహకార సంఘాలున్నాయి. మిగతా చోట్ల మండలానికి ఒకటి చొప్పున సహకార సంఘాలున్నాయి. కొత్తవాటితో కలిపి వీటి సంఖ్య 46కు చేరుకోనున్నది. ప్రస్తుత సహకార సంఘాల పదవీకాలం వచ్చే నెల 15తో ముగియనున్నది. వాటితో పాటు కొత్తవాటికి కూడా ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. కాని, ప్రభుత్వం సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఇప్పటివరకూ ప్రారంభించలేదు. దీంతో సకాలంలో సహకార సంఘాలకు ఎన్నికలు జరుగుతాయా.. లేక పదవీకాలం పొడిగిస్తారా అనేది సస్పెన్స్‌లో ఉన్నది. సకాలంలో ఎన్నికలు జరిగితే కొత్తవాటికీ ఎన్నికలు జరిగి, మరికొంతమందికి రాజకీయంగా పదవులు లభించే అవకాశాలున్నాయి.
కొత్తగా ఏర్పాటు కానున్న సహకార సంఘాల ద్వారా రైతులకు సేవలు సులభతరం కానున్నాయి. ప్రతి మండలానికి ఒకటి చొప్పున ఉన్న సహకార సంఘాలతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం నూతనంగా రైతులకు సేవలు మరింత చేరువ చేసేందుకు నూతనంగా సహకార సంఘాలను ఏర్పాటు చేయడం సంతోషకరం.
– కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ సర్పంచ్, ఆరుట్ల