రంగారెడ్డి, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టి చాకిరీ విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరవనిత చాకలి ఐలమ్మ అని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యాలయంలో బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతిని నిర్వహించారు. కలెక్టర్ శశాంక ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరవనితగా గుర్తింపు పొందిన ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి 2022 సెప్టెంబర్ 22న ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. మాటల్ని తూటాలుగా మల్చుకొని పేదల పక్షాన నిలిచి పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. 1940-44 మధ్య కాలంలో విస్నూర్‌లో దేశ్ ముఖ్, రజాకర్ల అరాచకాలపై వీరోచిత పోరాటం చేసి ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి కేశవ్ రామ్, రజక సంఘం ప్రెసిడెంట్ ఎ.ఆంజనేయులు, జిల్లా రజక సంఘం ప్రెసిడెంట్ ఎం. అజయ్, బీసీ ఫ్రంట్ చైర్మన్ మల్లేశ్‌యాదవ్, ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.