షాద్‌నగర్, డిసెంబర్ 15: రైతులు సాధారణ పంటలను వదిలి లాభాలు ఆర్జించే ఉద్యానవన పంటల వైపు అడుగులు వేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వచ్చే పూల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో 4,082 ఎకరాల విస్తీర్ణంలో 3,222 మంది రైతులు వివిధ రకాల పూల తోటలను సాగుచేస్తున్నారు. గ్రామీణ ప్రాంత రైతులతోపాటు హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న పట్టణ ప్రాంతాల రైతులు కూడా తమ పొలాల్లో పూల తోటలను సాగుచేస్తున్నారు.
చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, మహేశ్వరం, శంషాబాద్, కొత్తూరు, కేశంపేట, ఫరూఖ్‌నగర్ మండలాల రైతులు పూల తోటలను అధికంగా సాగు చేస్తూ లబ్ధి పొందుతున్నారు. రాష్ట్ర రాజధానికి రవాణా సౌకర్యం అందుబాటులో ఉండటంతో ఇక్కడి రైతులు కూరగాయాల సాగుతోపాటు పూల తోటలను సాగు చేస్తున్నారు. చామంతి, బంతి, గులాబీ, హైబ్రీడ్ గులాబీ, టైగర్ గులాబీ, కనకాంబరాలు, ముద్ద చామంతి వంటి పూల తోటలతోపాటు బొకె పిల్లర్ గ్రాస్, అస్పారస్ గ్రాస్ వంటి ఉద్యాన పంటలనూ సాగుచేస్తున్నారు. వాటిని ప్రతిరోజూ గుడిమల్కాపూర్, జాంబాగ్ మార్కెట్లకు తరలిస్తున్నారు.
పూల ధరలకు రెక్కలు
పూల సాగుపై ఆధారపడిన రైతులు లాభాలను ఆర్జిస్తున్నారు. ఇక్కడి వాతావరణం పూల సాగుకు అనుకూలం కావడంతో రైతులు అధికంగా పూల తోటలను పెంచుతున్నారు. గత కొవిడ్ కాలంలో పూల తోటలను సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రసుత్తం శుభకార్యాలు, వివాహాలు, అయ్యప్పస్వాముల పూజలు ఉం డటంతో పూల ధరలకు రెక్కలొచ్చాయి. గత మూడు నెలల నుంచి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. జర్బార పూలకట్ట రూ.60 నుంచి రూ.100 వరకు ఉన్నది.
గులాబీ కిలో రూ.120 నుంచి రూ.150 వరకు, గులాబీ పూలకట్ట రూ.200, చామంతి కిలో రూ.80-రూ.100, కనకాంబరాలు కిలో రూ.800-1000, బంతి కిలో రూ.40-60, లిల్లీ పూలు కిలో రూ.100-120 వరకు అమ్ముడుపోతున్నాయి. అదేవిధంగా డెకరేషన్ కు వినియోగించే అస్పారస్ గడ్డి కట్ట్ట రూ.40 వరకు పలుకుతున్నది. సాధారణ పంటల సా గుతో పోల్చితే పూలసాగుతో దిగుబడితోపాటు రా బడి పెరుగుతున్న దని పలు గ్రామాల రైతులు పేర్కొంటున్నారు.
కొన్నేండ్లుగా పూల తోటను సాగు చేస్తున్నా
కొన్నేండ్లుగా పూల తోటను సాగు చేస్తున్నా. ఇటీవలే ధరలు పెరిగాయి. దసరాకు ముందు బంతికి అంతగా డిమాండ్ లేదు. కానీ ఇప్పుడే మంచి ధర వస్తున్నది. స్థానికంగా ఉండే వ్యాపారులతోపాటు హైదరాబాద్‌లోని మార్కెట్లలో పూలను విక్రయిస్తున్నా. ధరలు ఈ విధంగా పెరిగితే గిట్టుబాటు అవుతుంది.
– మల్లేశ్, పూల సాగు రైతు, కొండన్నగూడ, ఫరూఖ్‌నగర్ మండలం
మంచి లాభాలు వస్తున్నాయి
మిగతా పంటలతో పోల్చితే పూల సాగుతో లాభాలు అధికంగా వస్తాయి. నేను కొన్నేండ్లుగా పూల తోటను సాగు చేస్తున్నా. ప్రస్తుతం చామంతి, బంతి, జర్మనీ పూలను పండిస్తున్నా. వాటిని ప్రతిరోజూ హైదరాబాద్ నగరంలోని గుడిమల్కాపూర్ మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయిస్తున్నా. మంచి లాభాలు వస్తున్నాయి.
– కిష్టయ్య, పూల రైతు నర్సప్పగూడ, నందిగామ మండలం షాద్‌నగర్