కేశంపేట, మే 27 : గ్రామీణ స్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కేశంపేట మండల కేంద్రానికి 30 పడకల ఆసుపత్రిని మంజూరు చేసింది. ప్రస్తుతం 6 పడకల ఆసుపత్రిగా ఉన్న దానిని 30 పడకలకు స్థాయి పెంచడంతో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా రూ.75 లక్షలతో ఆసుపత్రి భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. భవన నిర్మాణ పనులను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. మండల కేంద్రంలో ప్రాథమిక ఆర్యోగ కేంద్రానికి ఉన్న 4 ఎకరాలకు పైగా ఉన్న ప్రాంగణంలోనే 30 పడకల నూతన భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మండల ప్రజలకు ప్రస్తుతం ఆసుపత్రిలో మామూలు వైద్యసేవలు అందుతున్నాయి.
30 పడకల ఆసుపత్రి నిర్మాణంతో ప్రజలకు అత్యవసర సేవలతో పాటు గైనకాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి సేవలతోపాటు లేబొరేటరీ, స్కానింగ్, ఎక్స్‌రే సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. మండల ప్రజలు ప్రస్తుతం అత్యవసర సేవలు, ప్రసూతి సేవలకు, షాద్‌నగర్, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్నది. 30 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తైతే నిరంతరం నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో 24గంటల అత్యవసర సేవలతోపాటు అన్ని రకాల వైద్యసేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. దీంతో మండలంలోని గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నిరుపేదలకు మెరుగైన వైద్యం
కేశంపేటలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తైతే గ్రామీణ రైతులు, ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వచ్చి లాభం జరుగుతుంది. అత్యవసర సమయాల్లో వైద్యం కోసం పట్టణాల్లోని ఆసుపత్రులకు వెళ్లలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఆసుపత్రి స్థాయిని పెంచి నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో చాలా సంతోషంగా ఉంది.
– తిరుమలరెడ్డి శ్రీలత, సర్పంచ్, అల్వాల, కేశంపేట మండలం
వైద్యరంగంపై ప్రత్యేక దృష్టి
తెలంగాణలో నిరుపేదలకు వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి. సామాన్యుడికి కార్పొరేట్ స్థాయి వైద్యసేవలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో కేశంపేటలో 30 పడకల ఆసుపత్రితో 24 గంటలు అత్యవసర సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతుండటం చాలా మంచి పరిణామం.
– తాండ్ర విష్ణువర్ధన్‌రెడ్డి,సర్పంచ్, పాపిరెడ్డిగూడ, కేశంపేట మండలం
ఎమ్మెల్యే కృషితోనే అభివృద్ధి
నిరంతరం నిరుపేదల సంక్షేమం కోరే షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కృషితోనే కేశంపేట ప్రభుత్వాసుపత్రి 30 పడకల ఆసుపత్రిగా స్థాయి పెరిగింది. మండలంలోని గ్రామాల ప్రజలు కరోనా సమయంలో పడ్డ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిరుపేదలకు కేశంపేటలో మెరుగైన వైద్యసేవలు అందించాలనే సంకల్పంతో మంత్రి హరీశ్‌రావు సహాకారంతో నిధులు మంజూరు చేయించారు. – వేణుగోపాలాచారి,
టీఆర్ఎస్ నాయకుడు, సంగెం, కేశంపేట