రంగారెడ్డి, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని పలు జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో అత్యవసర వైద్యం అందక పలువురి ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. హైవేలపై ప్రభుత్వ దవాఖానలున్నా సరైన సౌకర్యాల్లేవని.. డాక్టర్లు అందుబాటులో లేరని చెప్పి ఉస్మానియా దవాఖానకు పంపిస్తున్నారు. క్షతగాత్రులు ప్రమాద స్థలం నుంచి నగరానికి చేరుకునే లోపే ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. సకాలంలో వైద్యం అందితే బతికేవారని వారిని పరీక్షించిన వైద్యులు పేర్కొంటున్నారు.
జిల్లా పరిధిలో హైదరాబాద్-నాగార్జునసాగర్, హైదరాబాద్-శ్రీశైలం, హై దరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు వంటి జాతీయ రహదారులున్నాయి. ఈ దారుల్లో ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. ప్రమాదాలు జరిగిన వెంటనే అత్యవసర వైద్యం కోసం అందుబాటులో ఉన్న ఆస్పత్రికెళ్తే.. అక్కడి సిబ్బంది నగరంలోని ఆస్పత్రులకు వెళ్లాలని సూచిస్తున్నారు. అలాగే, ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్స్‌లకు ఫోన్ చేసినా వారు సకాలంలో రాకపోవడంతో బాధితులు ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయిస్తున్నారు. అక్కడ అత్యవసర వైద్య సేవల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు.
యాచారం మండలంలోని నాగార్జునసాగర్ రోడ్డులో తమ్మలోగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా .. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలో ఉన్న యాచారం ప్రభుత్వ దవాఖాన కు తీసుకెళ్తే వైద్యులు లేరని అక్కడి నర్సులు చెప్పారు. అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లినా వైద్యులు లేరని తెలియడంతో వెంటనే నగరంలోని ఒక ఆస్పత్రికి తరలించారు.
అలాగే, ఇబ్రహీంపట్నం ఠాణా పరిధి కొహెడ ఎక్స్‌రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో పంకజ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సకాలంలో అంబులెన్స్ రాకపోవడం..అరగంట పాటు రోడ్డుపై తీవ్ర ఇబ్బంది పడి చివరకు ప్రాణాలు వదిలాడు. శేరిగూడ సమీపంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి రో డ్డు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొని కింద పడి.. సకాలంలో వైద్యం అందక అక్కడికక్కడే మృతిచెందాడు. ఇలాంటి ఘటనలు ప్రతిరోజూ జిల్లా పరిధిలోని జాతీయ రహదారులపై జరుగుతూనే ఉన్నాయి.
నాగార్జునసాగర్-హైదరాబాద్ రహదారి రక్తమోడుతున్నది. ఈ దారిలో ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నది. 2023లో 72 మంది మరణించగా, 50 మంది గాయపడ్డారు. 2024లో 130 మంది దుర్మరణం చెందగా 150 మంది గాయపడ్డారు. 2025 జూన్ వరకు 85 ప్ర మాదాల్లో 29 మంది మృతిచెందగా, 85 గాయపడ్డారు. అయినా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల్లో చల నం మాత్రం రావడంలేదు.
ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు మొబైల్ పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేశారు. కానీ, ఇటీవల ఆ వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదాల్లో ఎక్కువమంది గోల్డెన్ అవర్‌లో సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు.
ప్రమాదాలు జరిగిన వెంటనే ప్రభుత్వ దవాఖానల్లో క్షతగాత్రులకు వైద్యం అందకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రులే వారికి దిక్కవుతున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి వివిధ చికిత్సల పేరుతో డాక్టర్లు లక్షల రూ పాయలను వసూలు చేస్తున్నారు. మరోవైపు 108 సిబ్బంది కూడా ఆస్పత్రుల వారితో కమ్మక్కై ప్రభుత్వ దవాఖానలకు బదులు ప్రైవేట్‌కు తీసుకెళ్తున్నారనే ఆరోపణలున్నాయి.
హైవేల సమీపంలో ఉన్న మాల్, యాచారం, తుర్కయాంజాల్, బొంగ్లూరు, కందుకూరు, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు వంటి జాతీయ రహ దారులపై ఉన్న ఆస్పత్రుల్లోనూ క్షతగాత్రుల నుంచి రూ.లక్షలు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సాగర్, శ్రీశైలం రహదారుల్లో పలు ప్రభుత్వ ఆస్పత్రులన్నాయి. ఈ దారుల్లో రాత్రిపూట గాయపడిన బాధి తులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ దవాఖానలకు తరలిస్తే డాక్టర్లు లేరని, స్కానింగ్ వంటివి లేవని నగరంలోని ఉస్మానియాకు తీసుకెళ్లాలని సూచించి.. పంపిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు.