Tanduru | తాండూరు రూరల్, ఏఫ్రిల్ 18 : తాండూరులో ఈదురుగాలులతో పాటు వర్షం కురవడంతో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ వినియోగదారులు గురువారం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు జాగారం చేశారు. విద్యుత్ సమస్య తలెత్తిన చోట అధికారులు పునరుద్దరించడంలో పూర్తిగా విఫలమయ్యారని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి ఈదురు గాలులు వీచినా, తేలికపాటి వర్షం కురిసినా వెంటనే కరెంట్ కట్ చేయడం విద్యుత్ అధికారులకు పరిపాటిగా మారింది. మండలంలోని గౌతాపూర్, కోటబాసుపల్లి, కరణ్కోట విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలో పూర్తిగా కరెంట్ లేక చిమ్మచీకట్లోనే గడపాల్సి వచ్చింది. కరెంట్ పునరుద్దరించకపోగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల విద్యుత్ ఏఈ, ఆయా సబ్స్టేషన్ల పరిధిలో పని చేసే లైన్మెన్లపై పై వెంటనే చర్యలు తీసుకోవాలని మండల అధికారులు డిమాండ్ చేస్తున్నారు.