తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రం ఏర్పాటైతే చీకటి మయమవుతుందని అక్కసు వెల్లగక్కిన సమైక్య పాలకుల మాటలకు దీటుగా నేడు నిరంతర విద్యుత్తు సరఫరాతో విజయోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. నాడు గృహాలు, వ్యవసాయం, పరిశ్రమలు ఎక్కడ చూసినా కోతలతో కష్టాలు పడ్డాం.. నేడు నిరంతర విద్యుత్తు సరఫరాతో వెలుగులు విరజిమ్ముతుండడం గమనార్హం. సీఎం కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన వెంటనే వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. 2017 జనవరి 1 నుంచి వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో 27,516 వ్యవసాయ కనెక్షన్లు ఉండగా, లక్షా 20,713 మంది రైతులకు లబ్ధి చేకూరుతున్నది. నాడు జిల్లాలో 181… 33/11 కేవీ సబ్ స్టేషన్లు ఉండగా, నేడు 276 సబ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి.
దీంతో లో ఓల్టేజీ సమస్యకు పరిష్కారం లభించింది. గతంలో రంగారెడ్డి జిల్లాలో అన్ని కేటగిరీలకు కలిపి 11,97,885 కనెక్షన్లు ఉండగా, నేడు 21,31,319 కనెక్షన్లు పెరిగాయి. నిరంతర విద్యుత్తు సరఫరాతో సాగు విస్తీర్ణం పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. నాడు విద్యుత్తు సరఫరా సరిగ్గా లేక నెలల తరబడి కంపెనీలు మూత పడేవి. వేసవికాలం వచ్చిందంటే కంపెనీలు పవర్ హాలీడేలు ప్రకటించేవి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రంగారెడ్డి జిల్లాలో పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఆయా పరిశ్రమల్లో ఉత్పత్తి పెరుగడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాలకు అండగా నిలుస్తున్నది. 100 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగిస్తున్న ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తున్నది. 250 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగిస్తున్న హెయిర్ సెలూన్లు, లాండ్రీ షాపులకూ సబ్సిడీ ఇస్తుండడం విశేషం.
– రంగారెడ్డి, జూన్ 4 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తెలంగాణ చీకటి అవుతుందని అక్కసు వెల్లగక్కిన ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు, నాయకుల వ్యాఖ్యలకు దీటుగా నేడు తెలంగాణ అంతటా నిరంతర విద్యుత్తు సరఫరా జరుగుతున్నది. నాడు గృహాలు, వ్యవసాయం, పరిశ్రమలు ఎక్కడ చూసినా విద్యుత్తు కోతలుండగా…నేడు గృహావసరాలతోపాటు వ్యవసా యం, పరిశ్రమలకు నిరంతర విద్యుత్తు సరఫరా జరుగుతూ వెలుగులు విరజిమ్ముతున్నాయి. రైతులకు ఇచ్చిన మాట మేరకు కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలుత వ్యవసాయానికి పగలు 6 గంటలు, రాత్రి సమయంలో 3 గంటలపాటు విద్యుత్తు సరఫరాను అమలు చేశారు. రాత్రి పూట పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులు విద్యుదాఘాతానికి గురై మరణించడం తదితర ఇబ్బందికర ఘటనలతో రైతులకు ఇబ్బంది కలుగకుండా ఉండాలనే ఉద్దేశంతో 2016 ఏప్రిల్ 1 నుంచి వ్య వసాయానికి పగటి పూటనే తొమ్మిది గంటల పాటు విద్యుత్తును సరఫరా చేశారు. అనంతరం 2017 జనవరి 1 నుంచి వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతర ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తూ దేశంలోనే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
అంతేకాకుండా గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో విద్యుత్తు కోతలతో పారిశ్రామికాభివృద్ధి పూర్తిగా కూదేలైంది. నాడు పగలు రెండు గంటలపాటు రాత్రికి మరో రెండు గంటలపాటు అధికారికంగా పరిశ్రమలకు పవర్ కట్ చేసేవారు. కానీ అనధికారిక కోతలు రోజుకు ఆరేడు గంటలపాటు ఉండేవి. గతంలో విద్యుత్తు సరఫరా సరిగ్గా లేక రోజుల తరబడి, ఒక్కోసారి నెలల తరబడి కూడా నిర్వాహకులు తమ కంపెనీలను మూసుకోవాల్సిన పరిస్థితులుండేవి. వేసవికాలం వచ్చిందంటే చాలు చాలా పరిశ్రమ లు పవర్ హాలీడేలు ప్రకటించేవి. దీంతో చాలామంది ఉపాధి కో ల్పోయి రోడ్డున పడ్డ ఘటనలున్నాయి. కానీ .. ప్రస్తుతం పవర్ కట్కు రోజులుపోయాయి. రాష్ట్ర ప్ర భుత్వం పారిశ్రామిక రంగాన్ని మరిం త అభివృద్ధి చేసేందుకు పరిశ్రమలకు నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తున్నది. మరోవైపు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుతో ఇటు పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడంతోపాటు ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ఎస్సీ, ఎస్టీలకు 100 యూనిట్ల వరకు, హెయిర్ సెలూన్లు, లాండ్రీ షాపులకు 250 యూనిట్ల వరకు విద్యుత్తు సబ్సిడీని ఇస్తూ ప్రభుత్వం అండగా నిలిచింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు విద్యుత్తు విజయోత్సవం సందర్భంగా విద్యుత్తు రంగంలో వచ్చిన గుణాత్మక మార్పుపై ప్రత్యేక కథనం..
భారీగా పారిశ్రామిక ఉత్పత్తులు..
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో జిల్లాలో పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలకు 24 గంటలపాటు విద్యుత్తు సరఫరా చేస్తూ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నది. దీంతో అధిక మొత్తంలో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. కాగా గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో పరిస్థితి దారుణంగా ఉండేది. పగలు రెండు గంటలపాటు, రాత్రికి రెండు గంటలపాటు అధికారికంగా పరిశ్రమలకు పవర్ కట్ ఉండేది. కానీ అనధికారిక కోతలు రోజుకు ఆరేడు గంటలపాటు ఉండేది. కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి, ఒక్కోసారి నెలల తరబడి కూడా నిర్వాహకులు తమ కంపెనీలను మూసుకోవాల్సిన పరిస్థితులుండేవి. వేసవికాలం వచ్చిందంటే చాలు చాలా కంపెనీలు పవర్ హాలీడేగా ప్రకటించేవి. దీంతో చాలామంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడేవారు. కానీ ప్రస్తుతం పవర్ కట్కు రోజులు పోయాయి. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఇతర రాష్ర్టాల నుంచి కూడా విద్యుత్తును కొనుగోలు చేసి పరిశ్రమలకు నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తున్నది. చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమలతో ఇప్పటివరకు జిల్లాలో సుమారు 10 వేల మందికి ఉపాధి లభించింది. జిల్లాలో 3,217 ఇండస్ట్ట్రియల్ విద్యుత్తు కనెక్షన్లున్నాయి.
ఎస్సీ, ఎస్టీలకు..
బీఆర్ఎస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాలకు అండగా నిలిచింది. 100 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగిస్తున్న ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తున్నది. జిల్లాలో ఇప్పటివరకు 18,138 మంది ఎస్సీలకు రూ.3.5 కోట్ల విలువగ ల విద్యుత్తు సబ్సిడీ, 7,149 మంది ఎస్టీలకు కోటి విలువగల విద్యుత్తు సబ్సిడీని అందించింది. అదేవిధంగా 250 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగిస్తున్న హెయిర్ సెలూన్లు, లాండ్రీ షాపులకూ ప్రభుత్వం సబ్సిడీ అందిస్తున్నది. జిల్లాలో ఇప్పటివరకు 1,064 హెయిర్ సెలూన్లకు రూ.2 కోట్లు, 1,601 లాండ్రీ షాపులకు 3 కోట్ల మేర సబ్సిడీని ప్రభుత్వం అందించింది.
వ్యవసాయానికి ఉచిత నిరంతర విద్యుత్తు…
రైతులకు ఇచ్చిన మాట మేరకు కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలుత వ్యవసాయానికి పగలు 6 గంటలు, రాత్రి సమయంలో 3 గంటలపాటు విద్యుత్తును సరఫరా చేయాలని నిర్ణయించి అమలు చేశారు. 2016 ఏప్రిల్ 1 నుంచి వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తును సరఫరా చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం 2017 జనవరి 1 నుంచి వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నది. వికారాబాద్ జిల్లాలో నిరంతర విద్యుత్తును సరఫరా చేసేందుకు ప్రభుత్వం రూ.303 కోట్లు ఖర్చు చేసింది. కాగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు 24 గంటలపాటు నిరంతర విద్యుత్తు సరఫరా కోసం 11,617 కిలోమీటర్ల మేర 33 కేవీ, 11కేవీ, ఎల్టీ సామర్థ్యం గల విద్యుత్తు స్తంభా లతోపాటు 13,145 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు సరఫరాకు ముందు 400 మిలియన్ యూనిట్ల వినియోగం ఉండగా ప్రస్తుతం ఏడాదికి 1,379 మిలియన్ యూనిట్లు..రోజుకు ప్రస్తుతం 4-5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో 3 లక్షల విద్యుత్తు కనెక్షన్లుండగా వీటిలో 80 వేలు వ్యవసాయ కనెక్షన్లున్నాయి. నిరంతర విద్యుత్తు సరఫరాతో సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగింది. గతంలో 4.80 లక్షల ఎకరాలుగా ఉన్న ఆయా పంటల విస్తీర్ణం ప్రస్తుతం 6 లక్షల ఎకరాలకు పెరిగిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ఉచిత విద్యుత్తుతో ఎంతో మేలు..
ఇస్త్రీ షాపులకు కేసీఆర్ ప్రభుత్వం నెలకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందించి ఆదుకోవడం హర్షణీయం. నేను ప్రతి నెలా వంద యూనిట్ల వరకు విద్యుత్తును వినియోగిస్తున్నా. ఏడాది నుంచి విద్యుత్తు బిల్లులే కట్టడం లేదు. ప్రభుత్వ నిర్ణయంతో నాలాంటి పేద వారికి ఎంతో మేలు జరుగుతున్నది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు. -చాకలి శ్రీనివాస్,
బొంరాస్పేట,
బిల్లులు చెల్లించే భారం తప్పింది
నేను కుల వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నా. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో విద్యుత్తు బిల్లులు అధికంగా వచ్చేవి. నేను సంపాధించిన దాంట్లో కరెంట్ బిల్లుల చెల్లింపునకే సరిపోయేది. దీంతో కుటుంబ పోషణ భారంగా మారేంది. కానీ.. సీఎం కేసీఆర్ నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించడం చాలా బాగుంది. ప్రస్తుతం విద్యుత్తు బిల్లుల చెల్లించే భారం తప్పింది.
– సతీశ్, వికారాబాద్
పనులు వేగంగా జరుగుతున్నాయి
రాష్ట్రంలో 24 గంటలపాటు నిరంతర విద్యుత్తు సరఫరా జరుగుతుండటం తో తాండూరులోని నాపరాతి పరిశ్రమల్లో పనులు ఆగకుండా వేగంగా జరుగుతున్నాయి. ఒకప్పుడు కరెంటు కోతలతో నాప రాత్రి వ్యాపారం చాలా నష్టల్లో ఉండేది. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరుగుతున్నది. కూలీలకూ పనులు దొరుకుతున్నాయి. ప్రతిరోజూ రూ.1200 నుంచి రూ.1600 సంపాదిస్తూ సంతోషంగా జీవిస్తున్నారు.
-నయీం, స్టోన్ మర్చంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, తాండూరు
గతంలో విద్యుత్తు కోతలతో చాలా ఇబ్బందిగా ఉండే..
24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరాతో పంటలను సాగు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నాం. ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో విద్యుత్తు కోతలతో పంటలు పండించాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ప్రస్తుతం సంతోషంగా అన్ని రకాల పంటలను సాగు చేసుకుంటున్నాం.
-ప్యాలమద్ది రాజేందర్రెడ్డి, రైతు, తాండూరు