రంగారెడ్డి, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వ హణకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితాను ప్రకటించారు. అలాగే, పరిషత్ ఎన్నికలకు తుది ఓటరు జాబితాతోపాటు పోలింగ్ స్టేషన్లు తదితర ఏర్పాట్లల్లో అధికారులున్నారు.
జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితా ముసాయిదాను శనివారం ప్రకటించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ జాబితాలో అభ్యంతరాలుంటే ఈ నెల 6 నుంచి 8వరకు వాటిపై దరఖాస్తు చేసుకోవాలి. వాటిని ఈ నెల 9న పరిశీలించి 10న తుది జాబితా విడుదల చేయనున్నారు. ఈ మేరకు జిల్లాలోని ఆయా గ్రామ పంచాయతీల్లో ఓటరు జాబితాను అందుబాటులో ఉంచనున్నారు.
జిల్లాలో ఎంపీటీసీల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. జిల్లాలో గతంలో ఉన్న ఎంపీటీసీల పరిధిలో ఉన్న గ్రామాలు ఎక్కువ శాతం మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. జిల్లాలోని మొత్తం మున్సిపాలిటీలు 230కి కుదించారు. అలాగే 21 జడ్పీటీసీలున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 1,347పోలింగ్ కేంద్రాలను గుర్తించారు.
పరిషత్ ఎన్నికలకు సంబంధించిన ఓటరు తుది జాబితాను ఈ నెల 10న ప్రకటించనున్నట్లు జడ్పీ సీఈవో తెలిపారు. పరిషత్ ఎన్నికల కోసం 7,52,254 మంది ఓటర్లు ఉన్న జాబితాను తయారు చేశారు. జాబితాలో చనిపోయిన వారు ఉన్నా.. రెండో చోట్ల ఓట్లు ఉన్నా.. గ్రామాల్లో లేని వారి ఓట్లు వచ్చినా అభ్యంతరాలు తెలియజేయడానికి రెండు రోజుల గడువు ఇచ్చారు.