రంగారెడ్డి, నవంబర్ 17 : పింఛన్ల పెంపు కోసం వృద్ధులు, దివ్యాంగులు ఆందోళనకు సిద్ధమయ్యారు. నేడు కలెక్టరేట్ల ఎదుట నిరసన తెలపాలని నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.. 11 నెలలు దాటినా ఇంకా పెంచకపోవడంతో రేవంత్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. సోమవారం దివ్యాంగుల హక్కుల పోరాట సమితితోపాటు పలు పింఛన్‌దారుల సంఘాల ఆధ్వర్యంలో రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్నం 12 గంటలకు నిరసనతోపాటు రిలే దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. దివ్యాంగులకు రూ.6 వేలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులకు రూ.4 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం నుంచి ఈ నెల 23 వరకు కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలను కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.
జిల్లాలో 2,08,344 మందిపింఛన్దారులు
జిల్లాలో 2,08,344 మంది పింఛన్‌దారులున్నారు. వారిలో వృద్ధులు 84,836 మంది, దివ్యాంగులు 28,087, వితంతువులు 85,569, నేత కార్మికులు 848, పైలేరియా రోగులు 62తోపాటు గీత కార్మికులు, ఇతరత్రా పింఛన్‌దారులు ఉన్నారు.
పింఛన్లు పెంచే వరకు పోరాటం ఆగదు
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలి. దివ్యాంగులకు రూ.4016 నుంచి రూ.6,000 వితంతువులు, ఇతర చేయూత పింఛన్ల వారికి రూ. 2016 నుంచి రూ.4,000, కండరాల క్షీణత వారికి రూ.15,000 ప్రతినెలా 5వ తేదీలోగా చెల్లించాలనే ప్రధాన డిమాండ్‌తో నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు రిలే దీక్షలు చేపడుతున్నాం. పింఛన్లను పెంచే వరకు మా పోరాటం ఆగదు.
-కాళ్లె జంగయ్య, వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు