రంగారెడ్డి, జూలై 21 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ప్రజారోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాల్సిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందని ద్రాక్షలా మారింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లడానికి ప్రజలు ముందుకు రావడంలేదు. ఇదే అదునుగా భావించి ప్రైవేటు ఆస్పత్రులు గల్లీగల్లీకి వెలుస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో టెస్టుల పేరుతో పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు. అలాగే, ఆస్పత్రుల్లో కూడా బిల్లుల మోత మోగిస్తున్నారు.
దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలంటేనే హడలిపోతున్నారు. గత నెల రోజులుగా జిల్లాలో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులు ప్రబలి ప్రజలు మంచాన పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందని పరిస్థితిలో ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లను అందుబాటులో ఉంచి సరైన మందులు అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.
రంగారెడ్డిజిల్లాలో పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాలను కలిపి మొత్తం సుమారు 2,500 వరకు ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. ఈ ఆస్పత్రుల్లో 30 నుంచి 50 పడకల ఆస్పత్రులు 700 వరకు ఉండగా, డయాగ్నోస్టిక్ సెంటర్లు మరో 700 వరకు ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో వైద్యం అత్యంత ఖరీదైనదిగా తయారైంది. టెస్టుల పేరుతో వేల రూపాయలు వసూళ్లు చేస్తున్న యాజమాన్యాలు ఆస్పత్రి బిల్లుల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు.
నగరశివారుల్లో విస్తరించి ఉన్న రంగారెడ్డిజిల్లా పరిధిలోని తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట్, హయత్‌నగర్, ఆదిబట్ల, తుక్కుగూడ, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, రాజేంద్రనగర్, మహేశ్వరం, కందుకూరు, షాద్‌నగర్, ఆమనగల్లు, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రైవేటు ఆస్పత్రులు వెలుస్తున్నాయి. వీటితో పాటు జిల్లాలోని 21 గ్రామీణ మండలాల్లోనూ ప్రైవేటు ఆస్పత్రులతో పాటు అనుమతులు లేని ఆస్పత్రులు కూడా ఉన్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో గల్లీగల్లీకి ఆస్పత్రులు మెడికల్ షాపులు ఏర్పాటు చేస్తూ వైద్యం పేరుతో పేదలను నిలువు దోపిడీ చేస్తున్నారు. మరోవైపు పెద్దాస్పత్రులు ఒక్కొక్క రోగికి రూ.2 నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేస్తున్నారు. టెస్టుల పేరుతో డయాగ్నోస్టిక్ సెంటర్లు, వైద్యం పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు బిల్లుల వసూళ్లపైన దృష్టి సారిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు కుమ్మక్కై లేని వ్యాధులను కూడా ఉన్నట్లుగా భయపెట్టించి డబ్బులు వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలున్నాయి.
జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం, యాచారం, మహేశ్వరం, శంషాబాద్, హయత్‌నగర్, ఆమనగల్లు, షాద్‌నగర్ వంటి ప్రాంతాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సివిల్ ఆస్పత్రుల పేరుతో మెరుగైన వైద్యసేవలందించేవారు. సివిల్ ఆస్పత్రులను కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా మార్చి వాటి నిర్వహణను వైద్యవిధాన పరిషత్‌కు అప్పగించారు.
దీంతో వైద్యవిధాన పరిషత్ ఉన్నతాధికారులు కాని, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వీటిపై దృష్టి సారించకపోవడం వలన పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఈ ఆస్పత్రుల్లో రాత్రిపూట డాక్టర్లు ఉండటంలేదు. పగటిపూట కూడా డాక్టర్లు ఉన్నా మందులు లేవని వెనక్కి పంపిస్తున్నారు. మండల కేంద్రాల్లో ఉన్న ఆస్పత్రుల్లో కూడా సరైన సదుపాయాలు, మందులు లేకపోవడం వలన ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు వైద్యం అందడంలేదు.
ఎలాంటి అర్హత లేకున్నప్పటికీ కొంతమంది జిల్లాలో ఆస్పత్రులను నిర్వహిస్తున్నారు. కొంతమంది డాక్టర్లను ఏర్పాటు చేసుకుని వైద్యంపై ఎలాంటి అవగాహన లేనివారు సైతం ఆస్పత్రులను నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అర్హతలేని డాక్టర్లు వైద్యం చేసి ఇటీవల పలువురు మృతిచెందడానికి కారకులవుతున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. గత కొంతకాలంగా జిల్లాలోని షాద్‌నగర్, తుర్కయాంజాల్, ఇబ్రహీంపట్నం, యాచారం, శంషాబాద్, తుక్కుగూడ తదితర ప్రాంతాల్లో అర్హతలేని డాక్టర్లు వైద్యం చేయడంతో అవి వికటించాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఆర్ఎంపీ డాక్టర్లు క్లినిక్‌లలో చేరిన రోగులకు సరైన వైద్యసేవలందించక పరిస్థితి విషమించడంతో పెద్దాస్పత్రుల పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులకు పంపించి పెద్ద మొత్తంలో ఫీజులు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా గ్రామీణ మండలాల్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్లు డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఆస్పత్రుల యాజమాన్యాలతో కుమ్మక్కై పెద్ద మొత్తంలో ఫీజులు వసూళ్లు చేస్తున్నట్లు.. వసూలు చేసిన ఫీజుల్లో ఆర్ఎంపీ డాక్టర్లకు కూడా వాటాలు ఇస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి.