గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Aug 19, 2020 , 00:05:44

డిజిటల్‌కు ఓకే

డిజిటల్‌కు ఓకే

రంగారెడ్డి,నమస్తే తెలంగాణ : విద్యారంగంపై కొవిడ్‌ -19 తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. జూన్‌లోనే పాఠశాలలు ప్రా రంభించాల్సి ఉండగా ఇంత వరకు మొదలుకాలేదు. కరో నా ఎఫెక్ట్‌తో విద్యా సంవత్సరం ఎప్పుడు మొదలవుతుం దో చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం సైతం ఈ విషయంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఓ వైపు కరోనా కేసులు పెరిగి పోతుండడంతో పాఠశాల విద్యాశాఖ ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నది. దీనికి అనుగుణంగా కసరత్తు మొదలుపెట్టింది. డిజిటల్‌ తరగతుల నిర్వహణకు సంబంధించి మూడు రోజులుగా జిల్లా విద్యాశాఖ సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదించింది. రంగారెడ్డి జిల్లాలో దాదాపుగా 1,200 పాఠశాలలు ఉన్నాయి. బాలు రు 61,241మంది, బాలికలు 56,531 మంది మొత్తం లక్ష 17వేల 772 ఉన్నారు. నేర్చుకోవడానికి డిజిటల్‌ పరికరాలు లేనివారు బాలురు 2,619, బాలికలు 2,417, మొత్తం 5,036 మందిని గుర్తించారు. 886 ప్రాథమిక, 178 ప్రాథమికోన్నత, 244 ఉన్నత పాఠశాలలు, 27 కేజీబీలు, 10 మోడల్‌ స్కూళ్లకు సంబంధించి సర్వేలో వెల్లడైన అంశాలపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం..

ఈ విద్యా సంవత్సరం విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకున్నది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు డిజిటల్‌ తరగతులు వేర్వేరుగా ప్రారంభించాలని సన్నద్ధమవుతున్నది. ఇం దులో భాగంగా 6 నుంచి 10 తరగతులు, 3 నుంచి 5 తరగతులకు డిజిటల్‌ తరగతులు మొదలుపెట్టేందుకు జిల్లాలో విద్యాశాఖ సర్వే నిర్వహించింది. ఎంత మంది విద్యార్థులు డిజిటల్‌ పాఠాలు వినగలుగుతారో తెలుసుకునేందుకు పలు అంశాలపై ఈ సర్వే కొనసాగింది. ప్రభు త్వం ఆయా వివరాలు సేకరించేందుకు పలు అంశాలను జిల్లా విద్యాశాఖ అధికారులకు బాధ్యతలు అప్పగించింది. వివరాలు సేకరణకు ఒక మోడల్‌ తయారు చేసి పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపించింది. నిర్దేశించిన ప్రకారం 1 నుంచి 10 తరగతి విద్యార్థుల వరకు వారి తల్లిదండ్రుల వద్ద మొబైల్‌ ఫోన్లు, ఇండ్లలో టీవీలు ఎంతమంది వద్ద ఉన్నాయనే వివరాలు సేకరించింది. 

మూడురోజుల పాటు సర్వే..

జిల్లాలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ నెల 16, 17, 18 తేదీల్లో తరగతుల వారీగా విద్యార్థుల వద్ద ఎంతమందికి మొబైల్‌ ఫోన్లు, టీవీలు ఉన్నాయనే వివరాలు సేకరించింది. దీని ప్రకారం జిల్లా విద్యాశాఖ వారు రాష్ట్ర శాఖ కార్యాలయ అధికారులకు ఈ సర్వే రిపోర్టులు పంపించారు. ఇంటర్నెట్‌ సదుపాయం లేని విద్యార్థుల వివరాలు, సదుపాయాలు ఉన్న వారి వివరాలు క్రోడీకరించారు. వీరందరికి డిజిటల్‌ బోధన చేసేలా చర్యలకు సిఫారసు చేస్తున్నది. అయితే సెల్‌ఫోన్‌ లేని విద్యార్థులను ఆ సదుపాయం ఉన్న విద్యార్థులకు అనుసంధానంగా, టీవీలు లేని వారికి ఉన్న వారి ఇండ్లకు పంపించి పాఠ్యాంశాలు వినేలా చర్యలు తీసుకోనున్నారు.