గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Aug 09, 2020 , 00:04:33

పీవీ కీర్తి దశదిశలా వ్యాప్తి

పీవీ కీర్తి దశదిశలా వ్యాప్తి

ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే అనేక సంస్కరణలు తీసుకువచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజకీయ కోవిదుడు పీవీ నరసింహరావు అని పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్‌, ఎంపీ    కే కేశవరావు అన్నారు. మొయినాబాద్‌ మండలం తోలుకట్టా గ్రామంలోని  పీవీ నరసింహరావు ఔషధ వనంలో పీవీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.  ఉత్తమ ప్రధాన మంత్రిగా పేరుగాంచిన ఆయన విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేయించేందుకు అసెంబ్లీలో తీర్మానానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భారత రత్న అవార్డు ఇప్పించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు. 

మొయినాబాద్‌: బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజకీయ కోవిదుడు అయిన పీవీ విగ్రహాన్ని ప్రపంచంలోని పది దేశాల్లో ఏర్పాటు చేయించడానికి తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిందని పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవ కమిటీ చైర్మన్‌, ఎంపీ కే.కేశవరావు అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలోని తోలుకట్టా గ్రామంలో గల పీవీ నరసింహరావు ఔషధ వనంలో స్వామి రామానంద తీర్థ మెమోరియల్‌ కమిటీ, స్వామి రామానందతీర ్థరీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌, పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవ కమిటీ సంయుక్తంగా పీవీ విగ్రహాన్ని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి శనివారం ఆవిష్కరించారు. అనంతరం ఎస్‌ఆర్‌టీఎంసీ చైర్‌పర్సన్‌, ప్రధాన కార్యదర్శి సురభి వాణిదేవి అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ పీవీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత దేశంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారన్నారు. ఆయనను ఆర్థిక పితామహుడిగా దేశ ప్రజలు కొనియాడుతున్నారన్నారు. ఆర్థిక వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి, బలోపేతం చేయడానికి ఆయన శాయశక్తులా కృషి చేశారన్నారు. పీవీ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృతనిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు. ఉత్తమ ప్రధాన మంత్రిగా పేరుగాంచిన పీవీ విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేయించడానికి అసెంబ్లీలో తీర్మానం చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్‌ ఆమోదించిందని చెప్పారు. దేశంలోని కొన్ని రాష్ర్టాలతో పాటు హైదరాబాద్‌లోని ప్రధాన సెంటర్‌లో పీవీ విగ్రహాలు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నదన్నారు. తమిళనాడులోని రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం మెమోరియల్‌ తరహాలో పీవీ మెమోరియల్‌ ట్రస్టు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. కొన్ని న్యాయపరమైన చిక్కులు రావడంతో కొంత ఆలస్యమయ్యిందన్నారు. ఆయనకు భారత ప్రభుత్వం ద్వారా భారత రత్న అవార్డు ఇప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఏడాది పాటు పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహించాలని భావించిన సీఎం కేసీఆర్‌ శత జయంతి ఉత్సవ కమిటీని ఏర్పాటుచేశారన్నారు. 

పీవీ తెలంగాణ బిడ్డ కావడం అదృష్టం: మంత్రి సబితారెడ్డి

పీవీ తెలంగాణ బిడ్డ కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శతజయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. ఆయన జీవిత చరిత ప్రస్తుత నాయకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమన్నారు. పీవీకి ఉన్న భూమిని పేదలకు పంచి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారన్నారు. రామానంద తీర్థ ట్రస్టు ఆధ్వర్యంలో పీవీ ఔషధ వనం ఏర్పాటు చేయడం జిల్లా ప్రజలు అదృష్టంగా భావించాలన్నారు. ట్రస్టు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రజాప్రతినిదులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పీవీ నరసింహరావు పరిశోధన సంస్థ అధ్యక్షుడు పీవీ ప్రభాకర్‌రావు, ఆర్గనైజింగ్‌ కమిటీ అధ్యక్షుడు శేఖర్‌ మారంరాజు, కార్యదర్వి వైవీ.చంద్రశేఖర్‌రావు, సభ్యులు కే.శ్రీనివాస్‌, బి.రవీందర్‌రెడ్డి, ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్‌, సర్పంచ్‌ కె.శ్రీనివాస్‌, ఎంపీటీసీ ఎం.రవీందర్‌, ఉపసర్పంచ్‌ బి.రవీందర్‌రెడ్డి, కో ఆప్షన్‌ సభ్యుడు బిలాల్‌, మాజీ జడ్పీటీసీలు కె అనంతరెడ్డి, కంజర్ల భాస్కర్‌, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, నాయకులు నర్సింహ్మారెడ్డి, జయవంత్‌, సత్యనారాయణ, రాఘవేందర్‌యాదవ్‌ పాల్గొన్నారు.