వికారాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ఎంపీ ఎన్నికల దృష్ట్యా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం భారీగా తరలించే అవకాశమున్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు చెక్‌పోస్టుల ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాకు ఆనుకొని ఉన్న కర్ణాటక సరిహద్దు వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రూ.50 వేల మించి నగదు ఉంటే స్వాధీనం చేసుకుంటున్నారు.
అధిక మొత్తం డబ్బులు తరలిస్తే సరైన ఆధారాలు, ధ్రువీకరణ పత్రాలను అధికారులకు చూపించాల్సి ఉంటుంది. సీజ్ చేసిన నగదుకు సంబంధించిన ఆధారాలను చూపిస్తే 3-4 రోజుల్లో డబ్బును రిలీజ్ చేస్తారు. లేదంటే ఎన్నికల అధికారులకు అప్పజెప్పుతున్నారు. రూ.10 లక్షలకు మించి నగదు పట్టుబడితే ఐటీ శాఖకు అందజేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు రూ.2.15 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క నవాబుపేట మండలంలోనే రూ.1.50 కోట్ల నగదును సీజ్ చేశారు. ఇప్పటివరకు ఆధారాలు చూపించిన రూ.79 లక్షలను రిలీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
జిల్లాలో 7 అంతర్రాష్ట సరిహద్దుల చెక్‌పోస్టులు, 8 అంతర్ జిల్లా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిఘా పెంచారు. 24 గంటలూ తనిఖీలు చేస్తూ అక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు రూ.8.71 లక్షల విలువైన 2909 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు 107 మందిపై కేసులు నమోదు చేశారు. మరోవైపు 2.2 కిలోల గంజాయి, రూ.24 లక్షల విలువ చేసే 338 గ్రాముల బంగారం, 5.12 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు.
240 లైసెన్సెడ్ గన్లు ఉండగా, ఇప్పటికే 218 మంది డిపాజిట్ చేశారు. 262 మంది రౌడిషీటర్లను బైండోవర్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చేసే ఖర్చుపై అధికారులు నిఘా పెట్టారు. ప్రచారంలో ఏయే ఖర్చు పెడుతున్నారనే దానిపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. చెక్‌పోస్టులతోపాటు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న వారిపై నేరుగా సామాన్య ప్రజానీకం కూడా ఫిర్యాదు చేసే విధంగా సీ-విజిల్ యాప్‌ను, 1950 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకువచ్చింది.
స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించి సరైన ఆధారాలుంటే వీలైనంతా త్వరితగతిన రిలీజ్ చేస్తున్నాం. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న నగదులో రూ.79 లక్షలను రిలీజ్ చేశాం. జిల్లా అంతటా గట్టి నిఘా పెట్టి డబ్బు, మద్యం తరలించకుండా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాం. ఏ అభ్యర్థి కూడా ఎన్నికల సంఘం నిర్ణయించిన దానికి మించి ఖర్చు చేయకుండా నిఘా పెట్టడంతోపాటు ఎప్పటికప్పుడు అభ్యర్థుల ఖర్చుల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేస్తున్నాం.
– సి.నారాయణరెడ్డి, వికారాబాద్ కలెక్టర్