తాండూరు, సెప్టెంబర్ 19 : వ్యాపారులు తమ స్వార్థం కోసం మార్కెట్లో వస్తువులతోపాటు ఆహార పదార్థాలనూ కల్తీ చేస్తున్నారు. తాండూరులో జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడి చేసి 196 కేజీల కల్తీ అల్లం పేస్ట్‌ను స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలను శుక్రవారం వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని మర్రిచెట్టు కూడలి సమీపంలోని మణికంఠ కిరాణా షాపులో కల్తీ అల్లం పేస్ట్‌ను జిల్లా టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వర్ పాషా బృం దం గుర్తించింది.
దీంతో యజమాని వీరన్నను అదుపులోకి తీసుకుని పేస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందని విచారించగా హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఇమ్రాన్ సలీం అనే వ్యక్తి నుంచి కొంటున్నట్లు చెప్పడంతో అతడ్ని కూడా అదుపులోకి తీసుకుని, 196 కేజీల కల్తీ అలం పేస్ట్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. వీరన్న నుంచి 30 కిలోలు, ఇమ్రాన్ నుంచి 166 కిలోల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను.. అదేవిధంగా 30 కిలోల చొప్పున ఉన్న కల్తీ అల్లం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌లో హానికరమైన రసాయనా లు, కృత్రిమ రంగులు వాడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. నిందితులు, స్వాధీనం చేసుకున్న సరుకును తదుపరి విచారణ నిమిత్తం తాండూరు పోలీసులకు అప్పగించారు. ఈ నకిలీ సరుకు ఎక్కడ తయారవుతున్నది దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా..? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం ఎస్పీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో కల్తీ ఆహార ఉత్పత్తులను తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.