పరిగి, జూలై 20 : కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి ఇటీవల తెల్ల రేషన్ కార్డులను జారీ చేసింది. మే 25లోగా మంజూరైన వాటికి జూన్లో కేంద్ర ప్రభుత్వ సూచనతో మొత్తం రేషన్ కార్డుదారులకు మూడు నెలలకు సరిపడ రేషన్ బియ్యం అందజేశారు. వికారాబాద్ జిల్లాలో 2.41 లక్షల పైచిలుకు తెల్ల రేషన్ కార్డులున్నాయి. ఈ కార్డుదారులందరికీ జూన్ నెలాఖరు లోపు మూడు నెలల బియ్యం పంపిణీ చేపట్టారు. మే 25 తర్వాత దరఖాస్తు చేసుకున్నవారికి, గతంలో దరఖాస్తు చేసుకున్నవారిలో కొంతమందికి ప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే..
ఇప్పటికే జూలై 20వ తేదీ దాటిపోయింది. కనీసం ఈ రెండు మూడు రోజుల్లో బియ్యం కేటాయింపులు జరిపితే ఈ నెల, ఆగస్టు నెల కోటా బియ్యం కార్డుదారులకు అందజేసేందుకు అవకాశముంటుంది. నెలాఖరు వరకు కోటా కేటాయింపులు జరపకపోతే, మధ్యలోనే స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదలైతే కొత్త కార్డులకు బియ్యం కోటా కేటాయింపు కష్టసాధ్యమవుతుందని పలువురు పేర్కొంటున్నారు.
ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే కొత్త కార్డులకు బియ్యం కేటాయింపు అంశంలో ఎన్నికల సంఘం అనుమతి వరకు వెళ్తుందని, అప్పుడు ఎన్నికల సంఘం కోటా కేటాయింపునకు అనుమతులు ఇస్తుందో, ఇవ్వదో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు. ఎన్నికల సంఘం కొత్త కార్డులకు బియ్యం కేటాయింపులు ఇప్పుడే వద్దని చెబితే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కొత్త కార్డులకు బియ్యం కోటా కేటాయింపులు నిలిచిపోయే ప్రమాదముందని పేర్కొంటున్నారు.
ఆదరాబాదరాగా కార్డుల పంపిణీ చేపడుతున్న ప్రభుత్వం ఆ కార్డులకు బియ్యం కేటాయింపులపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడం విడ్డూరం. ఈ విషయమై పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులను అడుగగా కొత్త కార్డులకు బియ్యం కేటాయింపు అంశంలో ఇప్పటివరకు తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని చెప్పారు. ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాతే కొత్త కార్డులకు బియ్యం కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ అంశం తమ చేతిలో లేదని, పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అందుకే సర్కారు వెంటనే చర్యలు తీసుకొని కొత్త కార్డులకు బియ్యం కేటాయింపు చేపట్టాలని కోరుతున్నారు.
ఈ నెల 14న ప్రారంభమైన రేషన్ కార్డుల పంపిణీ
సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించగా.. వికారాబాద్ జిల్లా పరిధిలో ఎమ్మెల్యేలు కొత్త రేషన్ కార్డుల ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు అందజేస్తున్నారు. కొద్ది రోజుల వ్యవధిలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయనే ఉద్దేశంతో హడావుడిగా రేషన్ కార్డుల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ చేపట్టారు. వికారాబాద్ జిల్లా పరిధిలో 17,563 కొత్త రేషన్ కార్డులు ఇటీవల మంజూరు చేయబడ్డాయి. వాటిలో వికారాబాద్ నియోజకవర్గానికి 3267, పరిగి నియోజకవర్గానికి 5629, కొడంగల్ నియోజకవర్గానికి 2579, తాండూరు నియోజకవర్గానికి 6021, చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని నవాబుపేట మండలానికి 67 తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేశారు. ఈ మేరకు ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యేలు రేషన్ కార్డుల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ చేస్తున్నారు.
కేటాయింపులో నిర్లక్ష్యం
పాలకులు ఊరూరా తిరిగి కొత్త రేషన్ కార్డుల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ చేపడుతుండగా.. కొత్త కార్డులకు బియ్యం కేటాయింపులు ఇప్పటివరకు జరగకపోవడం గమనార్హం. ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తుండగా.. ఇప్పటికే పాత కార్డుదారులకు జూన్, జూలై, ఆగస్టు మూడు నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీ పూర్తయింది. దీంతో కొత్తగా మంజూరు చేయబడిన రేషన్ కార్డుదారులకు బియ్యం కోసం ఎదురుచూపులు తప్పడంలేదు. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఈ వారంలో వస్తుందని ప్రభుత్వ పెద్దలే చెబుతున్న తరుణంలో కొత్త రేషన్ కార్డుదారులకు బియ్యం కోటా కేటాయింపులు చేపట్టడంలో పౌర సరఫరాలశాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలున్నాయి.