షాబాద్, మార్చి 14 : రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా 15,218 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,532 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 1,255 మందికి ప్రిస్కిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. ఉదయం 9 గంటలకే వైద్యబృందాలు తమకు కేటాయించిన శిబిరాలకు చేరుకుంటున్నాయి. జిల్లాలో కొనసాగుతున్న క్యాంపులను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారితోపాటు, డివిజన్‌స్థాయి వైద్యాధికారులు సందర్శించి వివరాలు తెలుసుకుంటున్నారు.
221 గ్రామాలు, 46 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు
బొంరాస్‌పేట : జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల ద్వారా వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కంటి సమస్యలతో వచ్చేవారికి చుక్కల మందుతోపాటు విటమిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. మంగళవారం జిల్లాలో 4658 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 782 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 637 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు 221 గ్రామాలు, 46 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహించినట్లు డీఎంహెచ్‌వో పాల్వన్‌కుమార్ తెలిపారు.