పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వికారాబాద్ జిల్లాలో ఈసారి 2,29,000 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయగా సుమారు 1,71,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. పత్తి కొనుగోలుకు సంబంధించి జిల్లా స్థాయిలో త్వరలో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరుగనున్నది. అందులో ఏఏ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలో నిర్ణయించనున్నారు. సీసీఐ ద్వారా మార్కెటింగ్ శాఖ అధికారులు పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నారు. జిల్లాలో 14 జిన్నింగ్ మిల్లులుండగా వాటిలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దీపావళి పండుగ నుంచి పత్తి ని కొనేందుకు సీసీఐ, మార్కెటింగ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తేమ 12 శాతంలోపు ఉంటే క్వింటాలుకు మద్దతు ధర రూ.6,380 చెల్లించనున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో తెల్లబంగారానికి మంచి డిమాండ్ ఉండటంతో జిల్లా రైతులు ఈసారి కూడా పత్తి సాగు వైపు ఎక్కువగా మొగ్గు చూపారు.
-పరిగి, అక్టోబర్ 13
రైతులు పంటలు పండించేందుకు అవసరమైన పెట్టుబడిసాయం అందించడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ద్వారా సర్కారు అండగా నిలుస్తున్నది. ప్రతి సంవత్సరం వానకాలం వ్యవసాయ ఉత్పత్తులు రైతుల ఇండ్లకు చేరే లోపు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ద్వారా వాటి సేకరణ జరుపుతుంది. ఈసారి సైతం రికార్డు స్థాయిలో సాగు చేయబడిన పత్తి ఉత్పత్తి ప్రారంభం కంటే ముందే పత్తి కొనుగోలు కోసం ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టింది. ఇందుకుగాను మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పత్తి కొనుగోలు కేంద్రాల్లో సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు జరిగేలా ఏర్పాట్లు చేపడుతున్నది. సాధ్యమైనంత త్వరగా రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ వానకాలంలో 2,29,000 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 1,71,000 మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి రానుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో సీసీఐ ద్వారా జిల్లాలో అవసరమైన ప్రతిచోటా పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పత్తి క్వింటాలుకు రూ.6,380 మద్దతు ధర చెల్లించనున్నారు. 12శాతం తేమ ఉంటేనే మద్దతు ధర లభిస్తుంది. త్వరలోనే కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఎక్కడెక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, ఇతర అంశాలపై నిర్ణయించనున్నారు.
జిల్లాలో 14 జిన్నింగ్మిల్లులు..
వికారాబాద్ జిల్లాలో 14 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. వాటిలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి సీసీఐ అధికారులు, మార్కెటింగ్ శాఖ ఉద్యోగి దగ్గరుంచి ఈ కొనుగోలు జరిగేలా చర్యలు చేపడుతారు. జిల్లాలోని తాండూరు మార్కెట్ కమిటీ పరిధిలో 3, వికారాబాద్ మార్కెట్ కమిటీ పరిధిలో 3, పరిగి మార్కెట్ కమిటీ పరిధిలో 3, మర్పల్లి మార్కెట్ కమిటీ పరిధిలో ఒకటి, ధారూర్ మార్కెట్ కమిటీ పరిధిలో ఒకటి, కోట్పల్లి మార్కెట్ కమిటీ పరిధిలో 2, కొడంగల్ మార్కెట్ కమిటీ పరిధిలో ఒక జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. ఈ మేరకు సంబంధిత జిన్నింగ్ మిల్లుల్లోనే పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. దీపావళి నుంచి వ్యాపారులు పత్తి కొనుగోలుకు సన్నాహాలు చేస్తున్నారు.
బయటి మార్కెట్లో రూ.8వేలు..
సీజన్ ప్రారంభంలోనే పత్తి ధర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. మంచి నాణ్యమైన పత్తి బయటి మార్కెట్లో క్వింటాలు రూ.8వేల వరకు విక్రయించబడుతుంది. జిన్నింగ్ మిల్లుల వ్యాపారులు సైతం ఈ దీపావళి నుంచి పత్తి కొనుగోలుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం క్వింటాలు పత్తి ధర రూ.6,380 నిర్ణయించగా ప్రస్తుతం రూ.8వేల వరకు ధర పలుకుతున్నది. గత సంవత్సరం మంచి ధర లభించడంతో రైతులు తమ దగ్గరలోని జిన్నింగ్ మిల్లుల్లోనే పత్తిని విక్రయించారు. మార్కెట్ ధరలలో ఏమాత్రం వ్యత్యాసం వచ్చినా రైతులను ఆదుకోవడానికి పత్తిని సీసీఐ ద్వారా కొనుగోలు చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేపడుతుంది. తద్వారా రైతాంగానికి ప్రభుత్వం మరింత అండగా నిలువనున్నది.
పత్తికి మద్దతు ధర..
జిల్లా పరిధిలోని మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలుకు సన్నాహాలు చేస్తున్నాం. జిల్లాలో 2.29లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయబడగా, 1.71లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుందని అంచనా వేయడం జరిగింది. ప్రభుత్వం క్వింటాలు పత్తికి మద్దతు ధర రూ.6380 నిర్ణయించింది. కలెక్టర్ అధ్యక్షతన పత్తి కొనుగోలుపై త్వరలోనే జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహిస్తాం.
– జి.సారంగపాణి, మార్కెటింగ్ శాఖ ఏడీ, వికారాబాద్ జిల్లా