రంగారెడ్డి, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : ఆరు గ్యారెంటీలతోపాటు ఇతర సంక్షేమ పథకాలు వర్తించాలంటే రేషన్ కార్డులను తప్పనిసరిగా కలిగి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో కొత్త రేషన్ కార్డుల కోసం జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు. మీ సేవతోపాటు ప్రజాపాలనలో 1,22,084 మంది దరఖాస్తులు చేసుకున్నారు.
వాటిపై పరిశీలన జరిపిన అధికారులు గత మా ర్చి నెలలో సుమారు 23,000 మందికి మాత్ర మే కొత్తగా రేషన్‌కార్డులు అందజేశారు. మిగిలిన దాదాపు 1,00,000 మంది పరిస్థితి అయోమయంగా మారింది. వారికి ఎప్పుడు పంపిణీ చేస్తా రో అధికారులు స్పష్టం చేయడం లేదు. సబ్సిడీ గ్యాస్, సబ్సిడీపై విద్యుత్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ పథకాలు తెల్ల రేషన్‌కార్డులు కలిగిన వారికే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
పరిశీలన పేరుతో కాలయాపన..
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పరిశీలన పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాకు చెందిన 21 మండలాలు, 16 మున్సిపాలిటీలు, 2 నగరపాలక సంస్థల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం అధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయి. కాగా, జిల్లాలో ఇప్పటివరకు అనధికారిక లెక్కల ప్రకారం రేషన్‌కార్డులు కలిగి ఉన్నా కుటుంబసభ్యులను అందులో చేర్పించాలని సుమారు 1,30,000 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం.
అలాగే, మీ సేవతోపాటు ఇటీవల నిర్వహించిన ప్రజాపాలనలో భాగంగా సుమా రు 5,00,000 వరకు కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా..అధికారులు వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. దరఖాస్తుల వాస్తవిక పరిశీలనకు.. అధికారులు చెబుతున్న లెక్కలకు ఏ మాత్రం పొంతన లేదు. దీంతో కొత్త రేషన్‌కార్డులు ఎవరికి వస్తాయో …ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది.
పైలెట్ గ్రామాల్లోనూ అరకొరే..
ప్రజా పాలనలో భాగంగా ఆరు గ్యారెంటీల అమలుకోసం ప్రభుత్వం జిల్లాలోని 21 మండలాల్లో 21 గ్రామాలను ఎంపిక చేసింది. ఆయా గ్రామా ల్లో ఆరు గ్యారెంటీలను వందశాతం అమలు చేస్తామని ప్రకటించింది. కానీ, పైలెట్ గ్రామాల్లోనూ దరఖాస్తు చేసుకున్న వారికి అరకొరగానే రేషన్ కార్డులను అందించారనే ఆరోపణలున్నా యి. మిగిలిన అర్హులు తమకు ఎప్పుడు ఇస్తారని .. అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
సన్నబియ్యానికి నోచుకోని పేదలు..
జిల్లాలో ఎంతోమంది పేదలున్నా వారికి రేషన్‌కార్డులు లేకపోవడంతో సన్నబియ్యానికి నోచుకోవడం లేదు. ప్రభుత్వం అర్హులందరికీ సన్నబియ్యం ఇస్తామని ప్రకటించినా ఎంతోమంది పే దలకు ఇంకా రేషన్ కార్డులే అందలేదు. దాంతో సన్నబియ్యం వారికి అందడంలేదు. ప్రభుత్వం స్పందించి అర్హులందరికీ రేషన్ కార్డులను పంపిణీ చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.
సంక్షేమ పథకాలు అందడం లేదు..
సంక్షేమ పథకాలు అందాలంటే రేషన్ కా ర్డు కలిగి ఉండాలని ప్రభుత్వం లింక్ పెట్ట డంతో ఇప్పటివరకు రెండుసార్లు దరఖాస్తు చేశా. అయినా, ఇప్పటికీ కొత్త కార్డు రాలేదు. అధికారులు జిల్లాలో 23,000 మందికి అందించి చేతులు దులుపు కొన్నారు. మిగిలిన దాదాపు 1,00,000 మందికి ఎప్పుడిస్తారో.. చెప్పడం లేదు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితంలేదు. ప్రభుత్వం స్పందించి త్వరగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలి.
-సిద్ధిగారి సురేశ్, కడ్తాల్ మండలం
సన్నబియ్యం రావడం లేదు..
కాంగ్రెస్ సర్కార్ ప్రతి పథకాన్నీ రేషన్ కార్డు తో ముడిపెట్టడంతో కొత్త కార్డుకోసం దరఖాస్తు చేశా. అయినా ఇప్పటికీ రాకపోవడం తో ఇబ్బందులకు గుర వుతున్నా. కార్పొరేషన్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే రేషన్ కార్డును అడుగు తు న్నారు. రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తున్న సన్నబియ్యం కూడా రావడం లేదు.
– పాలకుర్ల రాజు గౌడ్, నాగిళ్ల గ్రామం, మాడ్గుల మండలం
కొత్త కార్డులివ్వాలి
కాంగ్రెస్ పార్టీ అర్హులందరికీ రేషన్ కార్డులను పంపిణీ చేయాలి. ప్రతి పథకానికీ రేషన్ కార్డు ను లింక్ పెట్టడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా. అధికారులు కొంతమందికి కొత్త కార్డులను పంపిణీ చేసి మిగిలిన వారికి ఇవ్వకపోవడం దారుణం.
-కడారి అల్లాజీ యాదవ్, ఇర్విన్ గ్రామం, మాడ్గుల మండలం