రంగారెడ్డి, సెప్టెంబరు 3(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా మొదట ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేస్తున్నది. దీనిపై గత కొంతకాలంగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు మేరకు మంగళవారం విలీనానికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను జారీ చేసింది.
దీంతో రంగారెడ్డి జిల్లాలో 12 గ్రామ పంచాయతీలు సమీప మున్సిపాలిటీలలో విలీనం కానున్నాయి. బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్, తారామతి పేట పంచాయతీలు పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలో విలీనం కానున్నాయి. అలాగే.. శంషాబాద్ మున్సిపాలిటీలో బహదూర్ గూడ, పెద్ద గోల్కొండ, చిన్న గోల్కొండ, హమీదుల్లా నగర్, రషీద్ గూడ, ఘంసీమియాగూడ పంచాయతీలు విలీనం అవుతున్నాయి.
మీర్జాగూడ గ్రామపంచాయతీ నార్సింగి మున్సిపాలిటీలో, హర్షగూడ గ్రామపంచాయతీ తుక్కుగూడ మున్సిపాలిటీలో విలీనం కానున్నాయి. తక్షణమే గెజిట్ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నది.