యాలాల01: తాండూరు పట్టణంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో గంజాయి విక్రయిస్తున్నారన్న నమ్మదిగిన సమాచారం మేరకు శుక్రవారం ఎస్ఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అందులో భాగంగా రైల్వే స్టేషన్ సమీపంలో ఒక వ్యక్తి హ్యాండ్ బ్యాగ్‌తో అనుమానాస్పదంగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ వ్యక్తిని అదుపులోనికి తీసుకొని విచారించగా యాలాల మండలం రాస్నం గ్రామానికి చెందిన లాల్ మహ్మద్ (21) అని తెలిపాడు. అతని వద్దనున్న సుమారు రూ. 30 వేల విలువగల 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తాండూరు డి.ఎస్.పి బాలకృష్ణారెడ్డి తెలిపారు.
నిందితుడిని కోర్టులో హాజరు పరిచామన్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్న పౌరులు విధిగా పోలీసులకు తెలియజేయాలన్నారు. గంజాయి విక్రయంతో పాటు సేవించిన వారి పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి నిర్మూలనకు పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపడుతుందన్నారు. ఎవరైనా విక్రయిస్తున్నట్లు తెలిస్తే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని, వారి పేరు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు.